English | Telugu
సదాను వదలని ఆది! అలా అయిపోయిందేమిటి?!
Updated : Jul 19, 2021
బుల్లితెర మీదకు మూడేళ్ళ తర్వాత సదా రీఎంట్రీ ఇస్తున్నారు. డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో సదాను బుల్లితెర మీదకు తీసుకొచ్చిన ఈటీవీ, మల్లెమాల సంస్థ మరోసారి ఆమెను టీవీకి తీసుకొచ్చారు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి సదా అతిథిగా వచ్చారు. ఆ షోలో రెగ్యులర్ గా ఇంద్రజ కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంద్రజతో పాటు సదా కూడా సందడి చేయనున్నారు.
వర్ష, భాను చేసిన మాస్ డాన్స్ చూసిన తర్వాత 'పిల్లలు ఢీలో ఎందుకు లేరు' అని సదా అంటే... 'సదాగారు వచ్చి చాలాసేపు అయింది. ఏంటి? ఇంతవరకు జోకులు వేయలేదు అనుకుంటున్నా. ఈ ఎపిసోడ్ కి హీలేరియస్ జోక్ ఇది' అని హైపర్ ఆది అనడంతో అందరూ నవ్వేశారు. సదా మాత్రం ఒక్కసారిగా ఆది అలా అనేసరికి షాక్ అయ్యారు. పాపం... ఆమె నిజాయతీగా వర్ష, భాను డాన్స్ గురించి చెప్పినట్టు ఉన్నారు.
అతిథిగా రావడమే కాదు... 'జయం'లో హిట్ సాంగ్ 'రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో' పాటకు సదా డాన్స్ చేసి అలరించారు. ఆమెతో పాటు 'ఢీ'లో కంటెస్టెంట్లుగా చేసిన అక్సా ఖాన్, ఐశ్వర్య తదితరులు కాలు కదిపారు. అసలు, ఈ ప్రోమోలో హైలైట్ అంటే... సదాను వదలకుండా హైపర్ ఆది చేసిన హంగామా.
'ఆదిగారు అయినా... ఆదిగారి నవ్వు అయినా చాలు' అని సదా అనడమే ఆలస్యం... 'ప్రియతమా తెలుసునా? నా మనసు నీదేనని' సాంగ్ ప్లే చేశారు. వెంటనే ఆది పెర్ఫార్మన్స్ మొదలుపెట్టాడు. మోకాలి మీద కూర్చుని మరీ ఆమె చెయ్యి అందుకున్నాడు. 'ఢీ'లో కూడా ప్రియమణి విషయంలో ఇదే విధంగా అప్పుడప్పుడూ ఆది చేస్తుంటాడు. అయితే ప్రోమోలో సదాను చూసినవాళ్లంతా 'ఈమె సదేయేనా? ఇలా అయిపోయిందేమిటి?' అని అనుకుంటున్నారు. మునుపటి గ్లామర్ ఆమెలో కనిపించడం లేదనేది వారి అభిప్రాయం.