English | Telugu
పాతికేళ్ల క్రితమే నాగార్జున పాన్ ఇండియా సినిమా... ఎందుకు ఆగింది?
Updated : Jul 21, 2021
'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా సినిమాలు తీయడానికి ముందుకొచ్చిన హీరోలు, దర్శక నిర్మాతల సంఖ్య చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. 'హరిహర వీరమల్లు', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'లైగర్' వంటివన్నీ పాన్ ఇండియా సినిమాలు. అయితే, పాతికేళ్ల క్రితమే నాగార్జున హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లానింగ్ జరిగింది. స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. కానీ, చివర్లో సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు ఆగింది.
పాతికేళ్ల క్రితమే నాగార్జున కథానాయకుడిగా పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి. సినిమాటోగ్రాఫర్ అయిన గోపాల్ రెడ్డి నిర్మాత కూడా! 'హలో బ్రదర్' తర్వాత నాగార్జునతో పాన్ ఇండియా సినిమా తీయాలనుకున్నారు. 'అంతం' హిందీలో 'ద్రోహి' పేరుతో విడుదల కావడంతో ఉత్తరాది ప్రేక్షకులకు నాగార్జున పరిచయమే. అంతకు ముందు 'ఖుదా గావా' సినిమాలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవితో కలిసి నటించారు.
సో, నాగార్జునతో పాన్ ఇండియా సినిమా లాభసాటి వ్యాపారమే. అయితే, 'హలో బ్రదర్' విడుదల తర్వాత హీరోకు ఒక ఇమేజ్ వచ్చింది. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్ లో చివరి ఎపిసోడ్స్ మార్చమని అడిగితే... దర్శకుడు ఒక్క ముక్క కూడా మార్చనని, అలాగ అయితేనే సినిమా చేస్తానని చెప్పడంతో పక్కన పెట్టేశామని ఎస్. గోపాల్ రెడ్డి చెప్పారు. ఆ దర్శకుడు ఎవరనేది తెలియాలంటే ఈ వారం ప్రసారమయ్యే 'అలీతో సరదాగా' చూడాలి.
ఎస్. గోపాల్ రెడ్డి అతిథిగా వచ్చిన 'అలీతో సరదాగా' ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. అందులో రాఘవేంద్రరావుగారు తప్ప తనతో పనిచేసిన దర్శకులు అందరూ తిట్లు తిన్నవాళ్ళేనని గోపాల్ రెడ్డి చెప్పారు.