English | Telugu
రాగ సుధ పోలీస్‌స్టేషన్ లో అడ్డంగా దొరికిపోతుందా?
Updated : Feb 26, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. శ్రీరామ్ వెంకట్, వర్ష జంటగా నటించారు. బెంగళూరు పద్మ, జ్యోతిరెడ్డి, విశ్వమోహన్, జయలలిత, రామ్ జగన్, అనూషా సంతోష్ కీలక పాత్రలు చేశారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్ ల నేపథ్యంలో సాగే ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా ఆసక్తికర మలుపులతో సాగుతోంది. గత జన్మ ప్రతీకారం నేపథ్యంలో క్షణ క్షణం ఉత్కంఠభరితంగా సాగుతోంది. రాగసుధ దేవుని పటాల వెనక గన్ దాచిపెట్టడాన్ని కనిపెట్టిన సుబ్బు దాన్ని స్టేషన్ లో ఇచ్చేద్దామంటాడు.
రాగసుధ కంగారుపడుతుంది. బిజినెస్ టైమ్ కదా తరువాత ఇద్దాంలే అంటుంది. అనుమానం వచ్చిన సుబ్బు నీకు దీంతో ఏమైనా పనుందా అమ్మా? అంటాడు. అదేంటి బాబాయ్ నాకు దీంతో ఏం పనుంటుంది? అని తిరిగి ప్రశ్నిస్తుంది. ఇలాంటి విషయాలు ఆలస్యం చేస్తే ఆ తరువాత జరిగే పరిణామాల వల్ల జీవితమే దెబ్బతింటుందని ఇద్దరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి గన్ ఇచ్చేద్దాం అంటాడు సుబ్బు. నేనెందుకు బాబాయ్ మీరే వెళ్లి ఇచ్చేయండి అంటుంది రాగసుధ. నువ్వెందుకు రావమ్మా అంటాడు సుబ్బు.. నేను ఎప్పుడూ పోలీస్ స్టేష్ కి వెళ్లలేదంటుంది. మరి నేను ఎప్పుడూ వెళుతుంటానా? అని రాగసుధని రావాల్సిందే అంటాడు.
చేసేది లేక సుబ్బుతో కలిసి రాగసుధ స్టేషన్ కు వెళుతుంది. కట్ చేస్తే సోఫాలో ఆర్య వర్ధన్ మూడీగా కూర్చుని అనుకి కనిపిస్తాడు. ఏంటీ ఇది కలా నిజమా.. ఈయన ఇలా వున్నాడేంటీ అని అను ఆలోచనలో పడుతుంది. దగ్గరికి వెళ్లి పిలిచినా పెద్దగా పలక్కపోవడంతో ఇది మీరేనా అంటుంది. ఈ రోజు ప్రామిస్ డే.. అందులోనూ మీది అంటూ అను గుర్తు చేస్తుంది. వెంటనే పైకి లేచిన ఆర్య .. తనకు ప్రామిస్ చేయమని అనుని అడుగుతాడు.. రాగసుధ గురించి చెప్పమని ఇలా అంటున్నాడా? అని అను కంగారు పడుతూనే ప్రామిస్ చేస్తుంది.
కట్ చేస్తే ..పోలీస్ స్టేషన్ లోకి వెళ్లడానికి రాగసుధ భయపడుతూ వుంటుంది. మీరే వెళ్లి రివాల్వర్ ఇచ్చేసి రండి అంటుంది. ఇక్కడి దాకా వచ్చి లోపలికి రానంటే ఎలా అంటాడు సుబ్బు.. అనగానే ఇద్దరూ కలిసి స్టేషన్ లోకి వెళతారు అక్కడ సీఐని కలుస్తారు. జరిగిన విషయం చెప్పి గన్ ఇచ్చేస్తాడు సుబ్బు.. కానీ గన్ తనకు దొరకలేదని, మా అమ్మాయికి దొరికిందని చెప్పడంతో తనని పిలవమంటాడు సీఐ. తన స్టైల్లో రాగసుధని ప్రశ్నించడంతో సుబ్బు హడలిపోతాడు.. ఈ గన్ దొరికిందా?.. దొంగిలించావా?.. దీంతో ఎవరినైనా షూట్ చేయాలనుకున్నావా? అని ప్రశ్నలు సంధిస్తాడు సీఐ. ఆ తరువాత రాగసుధ ముఖాన్ని కవర్ చేస్తున్న కొంగుని తీసి ముఖం చూపించమంటాడు.. దీంతో రాగసుధ కంగారు పడుతుంది.. రాగసుధని చూసిన సీఐ ఏం చేశాడు? .. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.