English | Telugu

సెట్లో టీవీ న‌టుడికి దారుణ అవ‌మానాలు

బుల్లితెర‌పై తొలి హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు మేకా రామ‌కృష్ణ‌. `రుతురాగాలు`, `అమ్మ‌మ్మ‌.కామ్‌` వంటి సీరియ‌ల్స్ లో అద్భుతంగా న‌టించి మంచి గుర్తింపుని పొందారు. దాదాపు వంద‌కు పైగా సీరియ‌ల్స్ లో న‌టించిన ఆయ‌న బాహుబ‌లి, సైరా చిత్రాల్లో మెరిసిన విష‌యం చాలా మందికి తెలియ‌దు. `బాహుబ‌లి`లో అనుష్క పోషించిన దేవ‌సేన పాత్ర‌కు సోద‌రుడిగా, కుంత‌ల దేశపు రాజుగా క‌నిపించారాయ‌న‌. అలాంటి ఆయ‌న‌కు సెట్ లో జ‌రిగిన అవ‌మానాన్ని తాజాగా బ‌య‌ట‌పెట్టారు. దాదాపు 30 ఏళ్ల పాటు ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నా త‌మ‌ని ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌ని వాపోయారు.

ఇంత సీనియారిటీ వున్నా ఆయ‌న‌కు న‌టుడిగా ఇప్ప‌టికీ రావాల్సిన గుర్తింపు రాలేద‌నే చెప్పాలి. అయితే ఇన్నేళ్లూ ఇండ‌స్ట్రీలోనే కొన‌సాగుతున్నా త‌మ వంటి వారికి సెట్ లో జ‌రిగే అవ‌మానాలు అంతా ఇంతా కాద‌ని, ఫుడ్ ద‌గ్గ‌ర ప్రొడ‌క్ష‌న్ బాయ్స్ చాలా దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని, దీన్ని ఎదిరించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తే మ‌రో సినిమాలో అవ‌కాశం రాకుండా చేస్తార‌న్న భ‌యంతో ఎవ‌రూ వీరి ఆగ‌డాల‌ని బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని చెప్పుకొచ్చారు.

`ఇండ‌స్ట్రీలో మమ్మ‌ల్ని బాధ‌పెట్టిన సంఘ‌ట‌న‌లు చాలానే వున్నాయి. జీవిత‌మే వేస్ట్ అని క‌న్నీళ్లు పెట్టుకున్న సంద‌ర్భాలు వున్నాయి. పెద్ద వాళ్ల‌ని ఒక‌లా .. చిన్న ఆర్టిస్ట్ ల‌ని ఒక‌లీ ట్రీట్ చేస్తుంటారు. త‌ప్పులేదు కానీ కొన్ని ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు అయితే చిన్న ఆర్టిస్ట్ ల‌ను మ‌నుషుల్లా ట్రీట్ చేయ‌రు. చిన్న ఆర్టిస్ట్ లు అంటే ప్రొడ‌క్ష‌న్ బాయ్స్ ఘోరంగా అవ‌మానిస్తారు. చాలా నీచంగా చూస్తారు. వారిపై సీరియ‌స్ అయితే కాఫీలో మోష‌న్ ట్యాబ్లెట్స్ క‌లిపి ఇస్తారు. ఇలా న‌టి జ‌య‌సుధ‌గారికి జ‌రిగింది కూడా` అని షాకింగ్‌విష‌యాల్ని బ‌య‌టపెట్టారు మేకా రామ‌కృష్ణ‌.