English | Telugu
అమ్మానాన్నల చావుకు హిమే కారణమంటూ ఏడ్చిన శౌర్య!
Updated : Mar 12, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటూ టాప్ రేటింగ్ తో రికార్డులు సృష్టించిన ఈ సీరియల్ వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఎప్పుడైతే డాక్టర్ బాబు, వంటలక్క కలిసారో అప్పటి నుంచి ఈ సీరియల్ గతి తప్పింది. అనవసరమైన సాగదీత ధోరణిలో సాగుతూ వీక్షకుల్ని చిరాకు పెట్టిస్తూ చివరికి రేటింగ్ పడిపోయింది. దీంతో దర్శకుడు సీరియల్ ని కొత్త మలుపు తిప్పాలని ఏకంగా కీలక పాత్రధారులైన డాక్టర్ బాబు, దీప పాత్రలని చంపేశాడు.
హిమ అతి చేష్టల కారణంగా డాక్టర్ బాబు, దీప కారు ప్రమాదంలో లోయలో పడిపోయి మరణిస్తారు. విషయం తెలిసి సౌందర్య, ఆనందరావు భోరున విలపిస్తారు. కార్తీక్, దీప, హిమ ఫొటోలకి దండలు వేసి విచారంగా ఏడుస్తుంటారు. ఇంతలో వైట్ చీరలో వచ్చిన మోనిత `నేను చచ్చేంత వరకు కార్తీక్ ప్రేమ నాతోనే వుంటుంది. కార్తీక్ నాతో వుంటే గుండెల్లో వుండేవాడు.. కానీ దీపతో ఉన్నాడు కాబట్టే ఫొటోలో వున్నాడు` అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఇంద్రుడు, చంద్రమ్మ మెడిసిన్ కు డబ్బులు లేక దొంగతనం చేస్తారు.
ఇదే సమయంలో సౌందర్య, ఆనందరావుల ముందు అరుస్తూ శౌర్య.. హిమకు సంబంధించిన వస్తువులన్నింటినీ విసిరికొడుతూ "దాని వల్లే అమ్మా నాన్నలు చనిపోయారు. అదే చంపేసింది. నన్ను అనాథని చేసింది." అంటూ గట్టిగా ఏడుస్తుంది. దీంతో సౌందర్య "అది కాదు రౌడీ" అని పిలవగానే "ఆ శౌర్య ఎప్పుడో చచ్చిపోయింది" అంటూ ఏడుస్తుంది. అంతే కాకుండా "అమ్మానాన్నల చావుకు కారణమైన హిమ ఎక్కడో ఒకచోట బతికే వుంటుంది" అంటుంది. కట్ చేస్తే ఇంద్రుడు, చంద్రమ్మ ఇంట్లో వున్న హిమ స్పృహలోకి వస్తుంది. "నేను ఇక్కడికి ఎలా వచ్చాను?" అని అడుగుతుంది. హిమ మళ్లీ ఇంటికి వెళ్లిందా?.. శౌర్య రియాక్షన్ ఏంటీ? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.