English | Telugu
యూట్యూబర్ తాట తీసిన కరాటే కల్యాణి
Updated : May 13, 2022
కరాటే కల్యాణి నిత్యం ఏదో ఒక విషయం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల విశ్వక్‌సేన్ పై ఓ టీవీ ఛానల్ సృష్టించిన వివాదంపై ఘాటుగానే స్పందించి వార్తల్లో నిలిచారు కరాటే కల్యాణి. సదరు టీవి ఛానల్ ని ఎండగడుతూ విశ్వక్ సేన్ కు అండగా నిలిచారు. ఇక తాజాగా మరో వివాదంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నారు. వివాదాలపై నేరుగా స్పందిస్తూ వార్తల్లో నిలిచే కరాటే కల్యాణి ఈ దఫా ఓ యూట్యూబర్ తాట తీసి హల్ చల్ చేయడం కలకలం సృష్టించింది.
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై సినీ నటి కరాటే కల్యాణి దాడికి పాల్పడింది. ప్రాంక్ వీడియోల పేరిట మహిళలతో అసభ్యకర వీడియోలు చేస్తున్నాడంటూ అతనిపై దాడికి దిగింది. యూసుఫ్ గూడా సమీపంలోని మధురానగర్ రోడ్డుపై యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి, కరాటే కల్యాణి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ప్రాంక్ వీడియోల విషయంలో శ్రీకాంత్ రెడ్డిని నిలదీయడంతో తాజా వివాదం చోటు చేసుకుంది. నటి కరాటే కల్యాణి, మరో ఇద్దరు కలిసి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడికి దిగినట్టుగా తెలుస్తోంది.
ముందు కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ కాగా ఆ వెంటనే ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో గోడవ మరింత ముదిరింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న తరువాత ఇద్దరు ఎస్.ఆర్. నగర్ పోలీస్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ని నిషేధించాలని కల్యాణి డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో తన వద్దకు వచ్చి అకారణంగా దాడి చేసిన కరాటే కల్యాణిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.