English | Telugu
శౌర్య ఆగ్రహం.. అనాథగా మారిన హిమ
Updated : Mar 16, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా విజయవంతంగా సాగుతూ టాప్ రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ సీరియల్ ఇటీవల గాడి తప్పింది. సాగదీత ధోరణి కారణంగా పట్టుతప్పింది. ప్రేక్షకుల్లో క్రేజ్ ని కోల్పోయింది. దీంతో ఈ విషయాన్ని గమనించిన దర్శకుడు కాపుగంటి రాజేంద్ర దిద్దుబాట పేరుతో పాత్రలని ముగించేయడం మొదలుపెట్టాడు. కారు ప్రమాదం క్రియేట్ చేసి దీప, కార్తీక్‌ల పాత్రలకు ఎండ్ కార్డ్ వేసేసిన దర్శకుడు కొత్త తరం, ఎదిగిన తరం పేరుతో హిమ, శౌర్యలను కూడా త్వరలో పెద్దవాళ్లను చేయబోతున్నాడు.
ఇదిలా వుంటే బుధవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగబోతోంది. 'హిమ బ్రతికే వుంది.. ఏదో ఒక రోజు నా కంట పడుతుంది. ఆ రోజు దాన్ని చంపేస్తాను' అంటూ అరుస్తుంది శౌర్య.. 'నాకు చెల్లెలు లేదు.. ఒక వేళ వున్నా అది నా చెల్లెలు కాదు. దాని గురించి ఆలోచిస్తే నేను మీకు దక్కను' అంటూ సౌందర్యతో అంటుంది. ఈ మాటల్ని బయటి నుంచే విన్న హిమ అటు నుంచి అటే వెళ్లిపోతుంది. మోనిత ఇంటికి వెళ్లి తనని కలవాలనుకుంటుంది. కానీ తను అక్కడ కనిపించదు. అప్పుడే హిమ డాక్టర్ బాబు, మోనిత కలిసి పూజ చేసిన ఫొటో చూస్తుంది. ఆ తరువాత మోనిత.. ఆనందరావుతో వున్న ఫొటోని చూసి షాకవుతుంది.
నాన్న, మోనితతో కలిసి పూజ ఎందుకు చేశాడు? .. ఆనందరావు ఫొటో ఇక్కడ ఎందుకు వుంది? .. అని ఆలోచిస్తూ బయటికి వస్తుంది. అక్కడే ఇంద్రుడు, చంద్రమ్మ కనిపిస్తారు. 'నేను మీతో పాటే వచ్చేస్తాన'ని చెబుతుంది హిమ. కట్ చేస్తే, "నాకు పెద్ద కొడుకే ధైర్యం. వాడే లేని ఈ జీవితం ఎందుకండీ" అంటూ బోరున విలపిస్తుంటుంది సౌందర్య.. 'ఆడపడుచు ఏడుపు మంచిది కాదంటారు.. స్వప్న మనపై దుమ్మెత్తిపోసింది. ఇదంతా తన వల్లే జరిగింద'ని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? చంద్రమ్మ, ఇంద్రుడితో కలిసి హిమ మళ్లీ వాళ్ల ఇంటికే వెళ్లి పోయిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.