English | Telugu
సొంతూరి కష్టం తీర్చిన బిగ్ బాస్ గంగవ్వ
Updated : Apr 25, 2022
గంగవ్వ తనదైన యాసతో మై విలేజ్ షో, బిగ్‌బాస్ షోలతో పాపులర్ గా మారిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో తరువాత తన సొంత ఇంటి కలని నిజం చేసుకున్న గంగవ్వ తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తన యాసతో, కామెడీ టైమింగ్ తో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ స్టార్ గా మారిన గంగవ్వ ఇప్పడు మరోసారి వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ నాలుగవ సీన్ తరువాత ఇంటి నిర్మాణ పనుల్లో బిజీగా వుండిపోయిన గంగవ్వ టీవీ షో ల్లో పెద్దగా కనిపించలేదు. అయితే తాజాగా సొంత గ్రామం కోసం చేసిన పనికి మరోసారి గంగవ్వ వార్తల్లో నిలిచింది.
ఇటీవలే సొంతింటి కలని నిజం చేసుకున్న గంగవ్వ తన సొంత గ్రామానికి బస్సు సర్వీసును పునరుద్ధరించి రెండేళ్లుగా తన గ్రామ వాసులు పడుతున్న కష్టాలని పోగొట్టింది. వివరాల్లోకి వెళితే... గంగవ్వది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామం. ఈ గ్రామానికి ఈ గ్రామ జనాభా రెండు వేలు పైనే. ఈ గ్రామానికి బస్సు సర్వీసు వుండేది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా బస్సు సర్వీసును ఆర్టీసీ నిలిపివేసింది. దీంతో గ్రామస్తులు గత రెండేళ్లుగా జిల్తా కేంద్రానికి వెళ్లడానికి నానా యాతన పడుతున్నారు. విద్యార్థులతో పాటు గ్రామంలోని అన్ని వర్గాల వారు బస్సు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ప్రైవేట్ వాహనాలని ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో గ్రామస్తులంతా మళ్లీ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని గంగవ్వ సహయం కోరారు. ఇందుకు ముందుకొచ్చిన గంగవ్వ గ్రామ పెద్దలతో కలిసి ఆర్టీసీ అధికారుల్ని సంప్రదించింది. గంగవ్వ అభ్యర్థనతో కదిలిన ఆర్టీసీ యంత్రాంగం లంబాడిపల్లికి బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఊదు ట్రిప్పులుగా ఆర్టీసి సేవలు అందిస్తోంది. లంబాడీపల్లికి తిరిగి బస్సు రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.