English | Telugu
బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్ హంగామా
Updated : May 30, 2022
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్. అత్యధిక కాంట్రవర్సియల్ షోగా రికార్డు సాధించింది. ఈ షో చుట్టూ ఎలాంటి వివాదాలు, విమర్శలు తలెత్తినా నిర్వాహకులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. గత ఏడాది సీజన్ 5 ని విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ షో పూర్తయిన వెంటనే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ని ప్రారంభించేశారు. ఇది కూడా వివాదాలు, గొడవలు, కంటెస్టెంట్ ల అలకల మధ్య మొత్తానికి ఎండ్ అయింది. మహిళా కంటెస్టెంట్ విజేతగా నిలవడం లేదు అంటూ వినిపిస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ బిగ్ బాస్ నాన్ స్టాప్ వెర్షన్ కు బిందు మాధవి విజేతగా నిలిచి మహిళా ప్రేక్షకుల్ని సంతృప్తి పరిచింది.
తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ పూర్తయిపోవడంతో మళ్లీ టెలివిజన్ వెర్షన్ బిగ్ బాస్ సీజన్ 6 ని ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబధించిన ప్రోమోని ఇటీవలే విడుదల చేశారు. ఈ సీజన్ లో సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నామంటూ నాగార్జున అనౌన్స్ చేసిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. త్వరలోనే సీజన్ 6ని చాలా గ్రాండ్ గా ప్రారంభించడానికి స్టార్ మా వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి కూడా. ఇదిలా వుంటే టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ `బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్` హంగామా ని నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు 100 రోజుల చేసిన హంగామాని ఒక్క రోజులోనే టీవీ నటులతో చేయించి రచ్చ రచ్చ చేయబోతున్నారు. 16 మంది టాప్ టెలివిజన్ సీరియల్స్ స్టార్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి వారితో హంగామా చేయబోతున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించబోతోంది. 24 గంటల పాటు ప్రముఖ పాపులర్ సీరియల్స్ లోని 16 మంది పాపులర్ టీవీ నటీనటులు కలిసి ఈ షోలో హంగామా చేయబోతున్నారు. మధ్యలో దేత్తడి హారిక, రష్మీ గౌతమ్ స్పెషల్ డ్యాన్స్ లు, టీవీ నటులు చేసే రచ్చ, వాళ్లు ఆడే గేమ్స్, డ్యాన్సులు.. లవ్ ట్రాక్ లు ఒకటి కాదు ఇలా ప్రతీదీ బిగ్ బాస్ ఇంట్లో ఒక్కరోజు, 24 గంటల్లో చేసిన రచ్చని ప్రత్యేకంగా `బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్` పేరుతో చూపించబోతున్నారు. ఈ ప్రత్యేక షో త్వరలోనే స్టార్ మాలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన తాజా ప్రోమోని రీసెంట్ గా విడుదల చేశారు. ప్రోమో మామూలుగా లేదు. ఇక షో ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు.