English | Telugu
అనిల్ రావిపూడి, ఆటో రామ్ ప్రసాద్ ఎమోషనల్ సీన్! ఎందుకో తెలిస్తే...
Updated : May 19, 2022
జబర్దస్త్ కామెడీ షో ఈటీవీ ఛానల్ కు ప్రధాన ఆయువు పట్టుగా నిలిచి ఆ ఛానల్‌ని నిలబెట్టింది అని చెప్పక తప్పదు. అలాంటి ఈ షో పాపులర్ కావడానికి నలుగురు కారణం. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను. హైపర్ ఆది. ఈ నలుగురిలో ముగ్గురు అంటే సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ఎక్కువగా కలిసి స్కిట్ లు చేస్తూ జబర్దస్త్ ని రక్తికట్టించారు. తమదైన మార్కు హాస్యాన్ని అందిస్తూ ఈ షోని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు.
అయితే తాజాగా ఈ బంధం వీడింది. గత కొంత కాలంగా మంచి కో ఆర్డినేషన్ తో స్కిట్ లు చేస్తూ హాస్య ప్రియుల్ని కడుపుబ్బా నవ్విస్తున్న జబర్దస్త్ షోలో ఇప్పడు ఆటో రాంప్రసాద్ ఒంటరి అయ్యాడు. సుడిగాలి సుధీర్ హీరోగా సినిమాల్లోకి వెళ్లడం, అంతే కాకుండా ఇతర ఛానల్ లలో వరుస క్రేజీ ప్రోగ్రామ్ లు చేస్తుండటంతో తను ఈ షో నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు రావడంతో నటుడిగా బిజీ అయిపోయిన గెటప్ శ్రీను కూడా ఈ షోని వదిలేసినట్టుగా తెలుస్తోంది.
తనకు ఎన్నో ఏళ్లుగా అండగా నిలిచిన ఇద్దరు మిత్రులు షో నుంచి దాదాపుగా తప్పుకోవడంతో ఆటో రాం ప్రసాద్ జబర్దస్త్ కామెడీ షోలో ఒక్కసారిగా ఒంటరి వాడయ్యాడు. ఇదే విషయాన్ని ఈ షోలో గెస్ట్ గా పాల్గొన్న దర్శకుడు అనిల్ రావిపూడి గుర్తు చేశారు. 'నీపేరే ఆటో కదా? ఫస్ట్ టైమ్ నీ వీల్స్ (ఫ్రెండ్స్) లేకుండా స్కిట్స్ చేయడం ఎలా ఫీలవుతున్నావ్?' అని అడిగారు. దీంతో నోట మాట రాక ఆటో రాంప్రసాద్ ఎమోషనల్ అయి అలా చూస్తూ వుండిపోయాడు. అనిల్ రావిపూడి కూడా అతని పరిస్థితి చూసి ఫీలైనట్టుగా కనిపించింది. జబర్దస్త్ తాజా ఎపిసోడ్ ఈ నెల 20న ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.