English | Telugu
బిందు, అఖిల్‌లకు అనసూయ కౌంటర్లు
Updated : May 14, 2022
వరుస గెస్టులతో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో జిగేలు మంటూ ఆకట్టుకుంటోంది. సీన్ ఎండింగ్‌కి వచ్చేయడంతో మొన్నటిదాకా బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఒక్కొక్కరుగా వచ్చి సందడి చేస్తున్నారు. ఇటీవల మాస్ కా దాస్ విశ్వక్ సేన్ `అశోకవనంలో అర్జున కల్యాణం` టీమ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి హల్ చల్ చేసింది. తాజాగా ప్రముఖ యాంకర్, నటి అనసూయ కూడా హౌస్‌లోకి అడుగుపెట్టేసింది. అయితే అందరిలా కాకుండా కంటెస్టెంట్లపై ప్రశ్నల తూటాలు వదిలింది. ముందు అరియానాను ఆడుకున్న అనసూయ ఆ తరువాత బిందు, అఖిల్‌లకు కౌంటర్లేసింది.
ఈ సందర్భంగా అనసూయకు హౌస్‌లో స్వాగతం పలుకుతూ నటరాజ్ మాస్టర్ లేడీ గెటప్ ధరించి `బావొచ్చాడోలప్పా.. అంటూ రచ్చ చేశాడు. నటరాజ్ మాస్టర్‌తో కలిసి బాబా భాస్కర్ కూడా రెచ్చిపోయి చిందులేశాడు. ఆ తరువాత ప్రేక్షకులు కంటెస్టెంట్లకు రాసిన ప్రశ్నలని కౌంటర్లుగా మార్చి అనసూయ ఒక్కో కంటెస్టెంట్‌పై పంచుల్లా వేసింది. 'ఫ్యామిలీ వీక్ తరువాత బిందుకు క్లోజ్ అయ్యావు.. ఎందుకు ఉమెన్ కార్డ్ వాడుతున్నావు? సడన్ గా ఎందుకిలా మారిపోయావ్?' అని అరియానాని ప్రశ్నించింది.
అనంతరం బిందు మాధవిని టార్గెట్ చేసిన అనసూయ, 'ఎప్పుడూ గ్రూప్ గేమ్ ఆడే నువ్వు అఖిల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని నిందిస్తున్నావ్' అంటూ కౌంటర్ వేసింది. దీంతో తాను ఎప్పుడూ గ్రూప్ గేమ్ ఆడలేదని గట్టిగా చెప్పేసింది బిందు. ఆ తరువాత అఖిల్‌కి పడింది కౌంటర్. 'గత కొన్ని రోజులుగా బిందు గురించి నెగటివ్‌గా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నావు. మరి ఫ్యామిలీ ఎపిసోడ్ తరువాత సడన్‌గా నీ స్టాండ్ ఎందుకు మారింది.. బిందు గురించి పాజిటివ్‌గా మాట్లాడటం మొదలు పెట్టావ్' అంటూ అఖిల్ కు దిమ్మతిరిగే కౌంటర్ వేసింది అనసూయ. ప్రస్తుతం దీనికి సంబందించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.