English | Telugu

క‌రోనా వ‌ల్ల‌ తప్పలేదు.. యాంకర్ ఝాన్సీ ఎమోషనల్ పోస్ట్!

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. వర్కవుట్ అవ్వడం లేదు. ఇక రాబోయే రెండు, మూడు నెలలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎంతో హడావిడి ఉంటుందో మనకి తెలిసిందే. కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు పెళ్లిళ్ల రూపురేఖలు మారిపోతున్నాయి. తక్కువ సంఖ్యలో అతిథులు ఉండాలనే నిబంధనలు ప్రభుత్వం విధించింది. దీంతో ఈ మధ్య అందరూ ఆన్‌లైన్ లో లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేసి బంధువులను, స్నేహితులను వేడుక చూడమని చెబుతున్నారు.

యాంకర్ ఝాన్సీ కూడా ఇప్పుడు అలా లైవ్‌లో నిశ్చితార్ధపు వేడుక చూసిందట. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఝాన్సీ తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో తనకు కొడుకు వరసైన వ్యక్తికి నిశ్చితార్ధం జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఆ ఈవెంట్‌ను తాను లైవ్‌లో చూడాల్సి వచ్చిందంటూ నిట్టూర్చింది. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

కరోనాను ద్వేషించడానికి మనకు చాలా కారణాలున్నాయని.. ఇది నా తాజా కారణం అంటూ మొదలుపెట్టిన ఝాన్సీ.. తనకు పుత్రసమానుడైన సంపత్ నిశ్చితార్ధం కనీసం ఆన్‌లైన్ లో అయినా చూసే అవకాశం వచ్చిందని.. వేడుకలో లేనప్పటికీ దానికి తగ్గట్లే రెడీ అయ్యానని ఝాన్సీ ఫోటోలు షేర్ చేసింది. అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వేడుక జరిగిందని.. అందరికీ నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చిన తరువాతే ఈవెంట్ కు హాజరయ్యారని.. దాదాపు మూడు వందల మంది లైవ్ లోనే ఎంగేజ్మెంట్ వేడుక చూశారని చెప్పుకొచ్చింది. ఇది కొత్తదే అయినా నేర్చుకుంటున్నామని.. కష్టమైనా తప్పడం లేదని ఎమోషనల్ గా రాసుకొచ్చింది.