English | Telugu
అభిమన్యు ఉచ్చులో యశోధర్ ఏం జరగబోతోంది?
Updated : Mar 29, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ఆనంద్ తదితరులు ఇతర పాత్రల్ని పోషించారు. ఓ పాప చుట్టూ సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా ఈ సీరియల్ ని దర్శకుడు రూపొందిస్తున్నారు. మంగళ వారం ఎపిసోడ్ మరో కొత్త మలుపు తిరగబోతోంది.
డాక్టర్ వేదని పెళ్లి చేసుకుని ఖుషీని దక్కించుకున్న యశోధర్ ని ఎలాగైనా దెబ్బకొట్టాలని ఎదురుచూస్తుంటాడు అభిమన్యు. ఇదే సమయంలో యశోధర్ ఫ్రెండ్ మ్యారేజ్ యానివర్సరీ పార్టీ అంటూ ప్రత్యేకంగా ఓ పార్టీని ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీకి యష్ ని ఆహ్వానిస్తే అయిష్టంగానే వేదతో కలిసి వెళతాడు. అదే పార్టీకి అభిమన్యు, మాళవిక వస్తారు. ఒంటరిగా వున్న వేదని తన ట్రాప్ లో పడేసుకోమని చెబుతాడు అభిమన్యు. తనని పట్టించుకోకుండానే యష్ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలో మందు కొట్టడం మొదలు పెడతాడు.
మధ్యలో ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని, ఓ విషయం చెప్పాలని ప్లాన్ వేసిన అభిమన్యు .. యష్ ని పక్కకు తీసుకెళ్లి తన కుట్రని మొదలుపెడతాడు. ఖుషీ తన కూతురని, తనకూ, మాళవికకు పుట్టిన పాప అని అబద్ధం చెప్పి యష్ ని ట్రాప్ చేస్తాడు. అభిమన్యు మాటల్ని గుడ్డిగా నమ్మేసిన యష్ మరింతగా తాగి తూలుతూ వేదని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోతాడు. మమ్మి ఏదంటూ అడిగిన ఖుషీపై అరుస్తాడు.. ఇంతలో అక్కడికి వేద వచ్చేస్తుంది. ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. తనని ట్రాప్ చేశారన్న విషయం యశోధర్ గమనిస్తాడా? .. యశోధర్ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో వేద తెలుసుకుంటుందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.