English | Telugu
అభిమన్యుని అడ్డంగా బుక్ చేసిన ఖుషీ.... యష్, వేద హ్యాపీ
Updated : Mar 11, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. గత కొన్ని వారాల క్రితమే మొదలైన ఈ సీరియల్ `స్టార్ మా`లో ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది? .. కథ ఎలాంటి మలుపులు తిరగబోతోంది? అన్నది ఒక సారి చూద్దాం. కోర్టులో నువ్వు ఎవరి దగ్గర వుండాలని కోరుకుంటున్నావని జడ్జి అడిగితే ఖుషీ తను మాళవిక అమ్మ తో వుంటానని చెబుతుంది. ఖుషీ నుంచి ఊహించని సమాధానం రావడంతో యష్, వేద షాక్ కు గురవుతారు. ఏంటీ ఇలా జరిగిందని మదన పడుతుంటారు. ఖుషీ తనకు దక్కలేదని బాధపడుతూ వుంటుంది వేద.
ఇదే విషయాన్ని తల్లి సులోచనకు ఫోన్ చేసి చెబుతుంది.. విషయం తెలిసి సులోచన ఎమోషనల్ అవుతుంది. ఇక కోర్టు విరామ సమయంలో యష్ - వేదల మధ్య గొడవ జరుగుతుంది. పెళ్లి చేసుకుని లాభం లేదని ఇద్దరూ నిట్టూరుస్తారు. ఇదిలా వుంటే ఒంటరిగా ఏడుస్తున్న ఖుషీ వద్దకు జడ్జి వచ్చి కూర్చుంటుంది. ఖుషీ బాధపడుతున్న తీరు గమనించి ఏం జరిగింది? అంటూ ఆరాతీస్తుంది. తనకు ఎవరంటే ఇష్టమో ఆరాతీస్తుంది. దీంతో తనకు వేద అంటే ఇష్టమని చెప్పిన ఖుషీ తనని ఎవరు బెదిరించి అలా చెప్పించారో బయటపెట్టి అభిమన్యుని అడ్డంగా బుక్ చేస్తుంది.
విషయం మొత్తం అర్థం కావడంతో మళ్లీ కోర్టు సెషన్ మొదలవగానే జడ్జి.. అభిమన్యు, మాళవికలకు దిమ్మదిరిగే షాకిస్తుంది. ఖుషీ కోరుకున్న అమ్మ ఎవరో కాదని, అమె కొత్త అమ్మ వేదశ్విని అని చెప్పి షాకిస్తుంది. దీంతో అభిమన్యు అభ్యంతరం చెబుతాడు. తప్పుడు తీర్పు ఇస్తున్నారని వాదిస్తాడు. దీంతో సీరియస్ అయిన జడ్జి ఖుషీని బోనులోకి పిలిచి తనని ఎవరు బెదిరించారో ధైర్యంగా చెప్పమంటుంది. జరిగిన విషయం చెప్పడంతో అభిమన్యు షాకవుతాడు. తనని అభిమన్యు బయటికి తీసుకెళ్లి బెదిరించాడని, అందుకే తాను మాళవిక అమ్మ గురించి చెప్పానని, తనకు వేద అమ్మ కావాలని, తనకే నన్ను అప్పగించండని ఖుషీ బోరుమంటుంది.
దీంతో జడ్జి ఖుషీ కస్టడీని వేదకు అప్పగిస్తూ తీర్పు చెప్పడంతో వేద ఆనందంతో ఖుషీని హత్తుకుని సంబరపడుతుంది. కట్ చేస్తే కోర్టు బయట అభిమన్యు, మాళవిక నీవల్లే కేసు ఓడిపోయామంటే నీ వల్లే ఓడిపోయామంటూ గొడవపడుతుంటారు. అది గమనించిన యష్ ఇద్దరి మధ్యన చేరి వినోదం చూస్తాడు. ఇదే సమయంలో ఇద్దరికి గట్టి క్లాస్ ఇస్తాడు. ఇదేరా నేను చూడాలనుకుంది అంటూ అభిమన్యుని గ్రామసింహంతో పోలుస్తాడు. అవమానం తట్టుకోలేని అభిమన్యు ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్లిపోతాడు. ఇంతకీ ఖుషీని అభిమన్యు , మాళవిక ... యష్ కు అప్పగించారా? .. ఏం జరగబోతోంది? అన్నది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.