English | Telugu
`కార్తీకదీపం` నుంచి ఒక్కొక్కరు ఔట్
Updated : Mar 15, 2022
కార్తీక్, దీపల పాత్రలని చంపేసి అర్ధంతరంగా వాళ్ల కథకు ముంగింపు పలకడాన్ని ప్రేక్షకులు, అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. వాళ్లు లేని 'కార్తీక దీపం' కొనసాగడం కష్టమే అంటూ మహిళా ప్రేక్షకులు ఇప్పటికే పెదవి విరుస్తూ దర్శకుడిపై మండి పడుతున్నారు. 1300 ఎపిసోడ్స్ విజయవంతంగా నడిచిన ఈ సీరియల్ జాతీయ స్థాయిలో టీవీ సీరియల్స్ లోనే టాప్ రేటింగ్ తో రికార్డుని సృష్టించింది. ఆ స్థాయిలో ఈ సీరియల్ కి ఆదరణ దక్కడానికి ప్రధాన కారణం డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలే. కథలో వాళ్లే లేకపోతే సీరియల్ కు ఇంత క్రేజ్ వచ్చేది కాదు.. ఈ రేంజ్ లో వైరల్ అయ్యేదీ కాదు.
కానీ దర్శకుడు నీరసంగా మారిన సీరియల్ ని కొత్త దారి పట్టిస్తున్నానని, నెక్స్ట్ జనరేషన్ కథ అంటూ దర్శకుడు కొత్త కథలు వినిపించడాన్ని జనం తప్పుపడుతున్నారు. ఇదిలా వుంటే దర్శకుడు ఆడియన్స్ కు మరో షాక్ ఇచ్చేశాడు. ఈ సీరియల్ నుంచి హిమ, శౌర్యని కూడా తీసేస్తున్నాడు. వీళ్ల పాత్రలని పెద్దవాళ్లుగా చేయడంతో ఆ స్థానంలో ఇతర నటుల్ని రంగంలోకి దించేస్తున్నారు. వీళ్ల స్థానంలో ఇద్దరు యంగ్ బ్యూటీస్ ని దించేస్తున్నాడు. వీళ్లకు జోడీలుగా ఇద్దరు యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ ని ఎంపిక చేసేశాడు.
Also Read:శౌర్య కారణంగా అనాథగా మారిన హిమ!
అందులో ఇప్పటికే బిగ్ బాస్ ఫేమ్ మానస్ ని ఎంపిక చేశాడు. త్వరలోనే మానస్ తో షూటింగ్ చేయబోతున్నాడట. "దీప, కార్తీక్ దంపతులు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు మనతోనే వున్నాయి. కొత్త తరం వేస్తున్న తొలి అడుగులతో సరికొత్త వాగ్దానంతో దివ్యకాంతులు విరజిమ్మబోతోంది కార్తీక దీపం" అంటూ నెక్స్ట్ జనరేషన్ కథకి లీడ్ వదిలారు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర. దీంతో హిమ, శౌర్యల పాత్రలతోనే `కార్తీక దీపం`ని దర్శకుడు కాపుగంటి రాజేంద్ర ముందుకు నడిపించబోతున్నానని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఈ సీరియల్ రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని అంతా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.