కరోనా చికిత్స కేంద్రంగా బెజవాడ
కృష్ణా జిల్లాలో రోజురోజుకూ అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఓపీ సేవలతోపాటు సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థో, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, ఈఎన్‌టీ, సైకియాట్రి, డయాలసిస్ ఇలా అన్ని రకాల వైద్యసేవలను అందిస్తూ జిల్లాలోనే పెద్దాసుపత్రిగా పేరొందిన విజయవాడ కొత్త ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని పూర్తిగా కరోనా వ్యాధి చికిత్సా కేంద్రంగా (కరోనా ఆసుపత్రి)గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1050 మంచాలతో కూడిన ఈ పెద్దాసుపత్రిలో ఇక నుంచి పూర్తిగా కరోనా వైరస్ బాధితులకు మాత్రమే వైద్యసేవలందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.