Read more!

English | Telugu

కంటెంట్ బేస్డ్ సినిమాలు త‌క్కువ ఆడుతున్నాయంటున్న‌ నితిన్‌

 

ప్రేక్ష‌కుల నాడి.. క‌రోనా త‌ర్వాత అర్థం కాకుండా ఉంటోంద‌ని అంటున్నాడు హీరో నితిన్‌. ఆయ‌న లేటెస్ట్ ఫిల్మ్ 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' ఈ నెల 12న విడుద‌ల‌వుతోంది. కృతి శెట్టి, కేథ‌రిన్ ట్రెసా హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాతో ఎడిట‌ర్ ఎస్‌.ఆర్‌. శేఖ‌ర్ (ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర‌రెడ్డి) డైరెక్ట‌ర్‌గా మారుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ చేసిన సాంగ్స్‌, ట్రైల‌ర్.. సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. అంజ‌లిపై చిత్రీక‌రించిన స్పెష‌ల్ సాంగ్ "రారా రెడ్డి" ప్ర‌జాద‌ర‌ణ బాగా పొందింది.

కాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ల‌వ్ స్టోరీస్ చేసి కొంత బోర్ ఫీలింగ్ వ‌చ్చింద‌నీ, డిఫ‌రెంట్‌గా చేసి నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లాల‌నే ఆలోచ‌న‌తో 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' మూవీ చేశాన‌నీ ఆయ‌న చెప్పాడు. ఇది ఫుల్ లెంగ్త్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ అయిన‌ప్ప‌టికీ స్టోరీ యూనిక్‌గా ఉంటుంద‌నీ, పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వ‌చ్చినా, మాచ‌ర్ల‌లో పాయింట్ కొత్త‌గా ఉంటుంద‌నీ అన్నాడు.

"నా క్యారెక్ట‌ర్ విష‌యంలో డైరెక్ట‌ర్ శేఖ‌ర్ చాలా హోమ్ వ‌ర్క్ చేశాడు. చాలామంది ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ను స్వ‌యంగా క‌లిసి, వాళ్ల బాడీ లాంగ్వేజ్ స్ట‌డీచేసి, ఎక్క‌డ డిగ్నిఫైడ్‌గా ఉండాలి, ఎక్క‌డ మాస్‌గా ఉండాల‌నే విష‌యం త‌నే షూటింగ్ స‌మ‌యంలో చెప్పాడు" అని తెలిపాడు నితిన్‌. కొవిడ్ త‌ర్వాత ప్రేక్ష‌కుల మూడ్ స్వింగ్ ఏమిట‌నేది అర్థం కావ‌డం లేద‌నీ, ఎలాంటి సినిమాకి వ‌స్తున్నారో స‌రిగా అర్థం కావ‌డం లేద‌నీ అన్నాడు. 

"కొవిడ్ తర్వాతే కమర్షియల్ సినిమాకి ఇంకా స్కోప్ పెరిగింది. సాఫ్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాలు తక్కువ ఆడుతున్నాయి. మాస్, హ్యుమర్, కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలే ఎక్కువ ఆడుతున్నాయి" అని త‌న అభిప్రాయం తెలియ‌జేశాడు నితిన్‌.