Read more!

English | Telugu

తెలుగులోనూ స్పెషల్ క్యారెక్టర్స్ చేయడానికి రెడీ!

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించిన 'లాల్ సింగ్ చడ్డా'లో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య 'బాలరాజు' అనే ప్రత్యేక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో చైతన్య బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. అయితే ఈ సినిమాలో తన పాత్ర నిడివి 30 నిముషాలు కూడా ఉండదని చెప్పిన చైతన్య.. పాత్ర నచ్చితే తెలుగులో సైతం ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధమని ప్రకటించాడు.

 

'లాల్ సింగ్ చడ్డా' మూవీ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రేపు(ఆగస్టు 11న) విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన చైతన్య సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మొదట ఈ పాత్ర కోసం మూవీ టీమ్ సంప్రదించినప్పుడు నమ్మలేదని, కానీ స్వయంగా ఆమిర్ గారు కాల్ చేసి మాట్లాడటంతో చాలా ఎగ్జైట్ అయ్యాయని చెప్పాడు. పాత్ర నిడివి 20-30 నిమిషాలే అయినప్పటికీ, చాలా మంచి పాత్ర కావడం, పైగా ఆమిర్ గారితో కలిసి నటించే అవకాశం రావడంతో వెంటనే ఒప్పుకున్నానని చెప్పాడు. నాన్నగారు(నాగార్జున), చిరంజీవి గారు సహా ఇప్పటికే సినిమా చూసిన వారంతా 'మాకు స్క్రీన్ మీద చైతన్య కనిపించలేదు.. బలరాజే కనిపించాడు' అని ప్రశంసించడంతో చాలా సంతోషం కలిగిందని అన్నాడు.

తనకు స్పెషల్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టమని చైతన్య చెప్పాడు. హీరోగా కొన్ని పరిమితులు, ప్రెజర్స్ ఉంటాయని.. కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కి అలాంటివి ఉండవని, నటుడిగా ప్రూఫ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని అన్నాడు. నటనకు ఆస్కారం ఉండే విభిన్న పాత్రలు వస్తే.. తెలుగులో సైతం స్పెషల్ క్యారెక్టర్స్ చేయడానికి రెడీగా ఉన్నానని చైతన్య తెలిపాడు.