Read more!

English | Telugu

ఒకేరోజు 15కి పైగా సినిమాల విడుదల!

పెద్ద సినిమాల విడుదల లేకపోతే ఆ వారం చిన్న సినిమాలకు పండగే. ఒక్కసారిగా విడుదలకు క్యూ కడతాయి. ఈ వారం బడా సినిమాల విడుదల లేకపోవడంతో పలు చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. దీంతో ఈ శుక్రవారం(డిసెంబర్ 9న) ఏకంగా 15 కి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి.

ఈ వారం విడుదలవుతున్న సినిమాలలో కొన్ని పేరున్న నటీనటులు నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్ నటించిన చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎక్కటకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్ నటించిన 'పంచతంత్రం' కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. ఇక విశ్వక్ సేన్ కీలక పాత్ర పోషించిన 'ముఖచిత్రం' సైతం ఈ వారమే విడుదలవుతోంది. 'గుర్తుందా శీతాకాలం'తో పాటు అదేరోజు మరో రొమాంటిక్ ఫిల్మ్ 'ప్రేమ దేశం'తో మేఘా ఆకాష్ సందడి చేయనుంది. త్రిగున్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మధుబాల కీలక పాత్ర పోషించడం విశేషం. ఇక ఇద్దరి అమ్మాయిల ప్రేమ కథ అంటూ అప్సర రాణి, నైనా గంగూలీతో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'డేంజరస్'(మా ఇష్టం) చిత్రం విడుదలకు కూడా ఈ వారమే మోక్షం కలిగింది.

ఈ ఐదు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాలు కలిపి మరో పదికి పైగా విడుదలవుతున్నాయి. అందులో వ్యాపారవేత్త విజయ్ శంఖేశ్వర్ బయోపిక్ గా తెరకెక్కిన 'విజయానంద్', తమిళ్ హీరో అరుణ్ విజయ్ నటించిన 'ఆక్రోశం', ప్రియమణి నటించిన 'డాక్టర్ 56'తో పాటు 'చెప్పాలని ఉంది', 'లెహరాయి', 'నమస్తే సేట్ జీ', 'రాజయోగం', 'AP04 రామాపురం', 'ఏయ్ బుజ్జి నీకు నేనే', 'తస్మాత్ జాగ్రత్త' ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి. యంగ్ బ్యూటీ శ్రీలీల నటించిన మొదటి కన్నడ మూవీ 'కిస్'(2019) సైతం 'ఐ లవ్ యూ ఇడియట్' పేరుతో ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు 'మాయాబజార్'(1957), ప్రేమ దేశం(1996) సినిమాలు కూడా రీరిలీజ్ అవుతున్నాయి. అంటే కొత్త, పాత కలిపి ఏకంగా 18 సినిమాలు వస్తున్నాయి. మరి ఒకేరోజు విడుదలవుతున్న ఇన్ని చిత్రాలలో ప్రేక్షకుల మెప్పు ఎన్ని పొందుతాయో చూడాలి.