Read more!

English | Telugu

బ్లాక్‌బ‌స్ట‌ర్ 'బింబిసార‌'తో 'డెవిల్‌'పై పెరిగిపోయిన అంచ‌నాలు!

 

'బింబిసార' మూవీతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌. అత‌ని కెరీర్‌లో 'అత‌నొక్క‌డే', 'ప‌టాస్‌', '118' లాంటి హిట్ మూవీస్ ఉన్నాయి. కానీ 'బింబిసార' మ‌రో లెవ‌ల్ హిట్ట‌యి, అత‌ని సినీ జీవితంలో బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా నిలుస్తోంది. విడుద‌లైన మూడు రోజుల‌కే బ్రేకీవెన్ సాధించి, నాలుగో రోజు నుంచి లాభాల‌ను పంచుతున్న ఈ సినిమాతో క‌ల్యాణ్‌రామ్ కెరీర్ బిగ్ ట‌ర్న్ తీసుకుంది. వ‌శిష్ట మ‌ల్లిడి అనే కొత్త డైరెక్ట‌ర్‌తో అత‌ను చేసిన ప్ర‌యోగం సూప‌ర్ హిట్ట‌యింది. సోషియో ఫాంట‌సీ క‌థ‌లో బింబిసారునిగా క‌ల్యాణ్‌రామ్ న‌ట‌న‌కు జ‌నం నీరాజ‌నాలు ప‌డుతున్నారు. 'బింబిసార'కు ముందు, 'బింబిసార‌'కు త‌ర్వాత అనేంత‌గా అత‌ను పేరు తెచ్చుకున్నాడు.

ఈ నేప‌థ్యంలో అత‌ని మ‌రో సినిమా 'డెవిల్‌'పై అంద‌రి దృష్టీ పడుతోంది. 1945 టైమ్ నాటి బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా క‌ల్యాణ్‌రామ్ క‌నిపించే ఈ సినిమా స్టోరీని 'పుష్ప' రైట‌ర్ శ్రీ‌కాంత్ విస్సా సూప‌ర్బ్‌గా రాశాడ‌ని టాక్‌. ఈ మూవీకి న‌వీన్ మేడారం డైరెక్ట‌ర్‌. బేసిక‌ల్‌గా వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అయిన న‌వీన్ ఇదివ‌ర‌కు ప‌లు హాలీవుడ్ సినిమాల‌కు వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్‌గా ప‌నిచేశాడు. తెలుగులో శ్రీ‌నివాస్ అవ‌స‌రాల హీరోగా 'బాబు బాగా బిజీ' మూవీని రూపొందించక మునుపు ఇంగ్లిష్‌లో 'నైస్ 2 మీట్ U', 'లండ‌న్ లైఫ్' మూవీస్ తీశాడు. 'బాబు బాగా బిజీ' స‌రిగా ఆడ‌క‌పోయినా ఇప్పుడు 'డెవిల్‌'తో సంచ‌ల‌నం సృష్టించ‌గ‌ల‌డ‌ని ఆ సినిమా యూనిట్ బ‌లంగా న‌మ్ముతోంది.

గ‌త ఏడాది బ్లేజ‌ర్‌, పంచెక‌ట్టు ధ‌రించి, చేతిలో గ‌న్‌తో ఒక‌ ట్రైన్ డోర్ ద‌గ్గ‌ర యాక్ష‌న్‌లోకి దిగుతున్న‌ట్లుగా రిలీజ్ చేసిన 'డెవిల్' ఫ‌స్ట్ లుక్ అమితంగా ఆక‌ట్టుకుంది. ఆ ట్రైన్ పైన కొంత‌మంది జ‌నం జాతీయ జెండాను ప‌ట్టుకొని క‌నిపిస్తున్నారు. 1945 నాటి బ్రిటిష్ ఇండియాలో మ‌ద్రాస్ ప్రెసిడెన్సీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. ఒక చీక‌టి ర‌హ‌స్యాన్ని ఛేదించ‌డానికి రంగంలోకి దిగే 'డెవిల్' క్యారెక్ట‌ర్‌ క‌ల్యాణ్‌రామ్‌కు న‌టునిగా మ‌రింత పేరు తీసుకు రావ‌డంతో పాటు, అత‌ని ఇమేజ్‌ను ఇంకా పెంచుతుంద‌ని అంచ‌నా. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ ఈ సినిమా విడుద‌ల కానున్న‌ది.