Read more!

English | Telugu

డబుల్ హ్యాట్రిక్ హీరో అడివి శేష్.. కొందరు హీరోలు చూసి నేర్చుకోవాలి!

టాలీవుడ్ లో ఈ జనరేషన్ లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా అడివి శేష్ పేరు తెచ్చుకుంటున్నాడు. కొంతకాలంగా శేష్ నటించిన సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. శేష్ కూడా ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశపరచకుండా మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తూ వరుస విజయాలు అందుకుంటున్నాడు. 'క్షణం' నుంచి 'హిట్-2' వరకు వరుసగా ఆరు విజయాలు అందుకొని డబుల్ హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

2002 లో వచ్చిన 'సొంతం' సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన శేష్.. ఎనిమిదేళ్ల తర్వాత హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతూ 'కర్మ'(2010) అనే చిత్రాన్ని చేశాడు. ఆ సినిమా కొత్తగా ఉందనే పేరు తెచ్చుకున్నా శేష్ ని హీరోగా నిలబెట్టలేకపోయింది. ఆ తర్వాత 'పంజా'(2011) చిత్రంలో నెగటివ్ రోల్ లో నటించి మెప్పించాడు. 2013 లో 'కిస్' అనే చిత్రంతో మరోసారి హీరోగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ 'కిస్' కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత 'రన్ రాజా రన్'(2014), 'బాహుబలి'(2015) వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించి మెప్పించిన శేష్.. 2016 నుంచి రూట్ మార్చాడు.

'కర్మ', 'కిస్' చిత్రాల తర్వాత దర్శకత్వాన్ని పక్కన పెట్టిన శేష్.. నటన, రచన మీద దృష్టి పెడుతూ వరుస విజయాలు అందుకుంటున్నాడు. శేష్ స్టోరీ అందించి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'క్షణం'(2016). ఈ మిస్టరీ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకొని ఆయనను హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత 'అమీ తుమీ'(2017) అనే రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తో ఆకట్టుకొని మరో హిట్ అందుకున్నాడు. అనంతరం స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన 'గూఢచారి'(2018)తో మ్యాజిక్ చేశాడు శేష్. ఈ చిత్రానికి కూడా ఆయనే కథ అందించడం విశేషం. ఇలా మూడు వరుస విజయాలతో హ్యాట్రిక్ హీరోగా మారిన శేష్.. ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అప్పటినుంచి ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

'క్షణం', 'అమీ తుమీ', 'గూఢచారి' ఇలా వరుస విజయాలు అందుకున్న శేష్.. ఆ సక్సెస్ జోష్ ని కంటిన్యూ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన 'ఎవరు'(2019)తో మరోసారి ఆకట్టుకున్న ఆయన.. లాక్ డౌన్ కారణంగా రెండేళ్లు సినిమాలను విడుదల చేయలేకపోయాడు. ఆ లోటుని ఈ ఏడాది రెండు ఘన విజయాలతో భర్తీ చేశాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'మేజర్'తో జూన్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రానికి కూడా శేష్ రచయితగా వ్యవహరించాడు. ఇక ఇటీవల హీరోగా 'హిట్-2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శేష్.. మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. 'క్షణం' నుంచి 'హిట్-2' వరకు వరుసగా ఆరు విజయాలు అందుకొని డబుల్ హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు శేష్.

మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ సినిమా సినిమాకి తన మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్న శేష్ ని చూసి ఇప్పటి హీరోలు ఎంతో నేర్చుకోవాలి. ముఖ్యంగా వచ్చిన ప్రతి సినిమాని చేస్తూ.. ఇంకా ఐదు ఫైట్లు, ఆరు పాటల కాలంలోనే ఉంటూ వెనకబడిపోతున్న కొందరు కుర్ర హీరోలు శేష్ ని చూసైనా తమ తీరుని మార్చుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.