Read more!

English | Telugu

కృతి శెట్టి గురించి మనకు తెలిసేది ఆరోజే!

ఇప్పటికే ఈ ఏడాది 'బంగార్రాజు', 'ది వారియర్' సినిమాలతో సందడి చేసిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఈ శుక్రవారం(ఆగస్టు 12న) 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ సినిమా విడుదలైన ఐదు వారాలకే మరో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతోంది.

 

సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. రొమాంటిక్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర చుట్టూనే ప్రధానంగా కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాని సెప్టెంబర్ 16న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో మెగాఫోన్ పట్టుకున్న సుధీర్.. కృతి వెనక పరుగెత్తడం చూడొచ్చు. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో సినిమా షూటింగ్ సెటప్ కనిపిస్తోంది. పోస్టర్ ని బట్టి చూస్తే ఇందులో కృతి వెంటపడే మూవీ డైరెక్టర్ పాత్రలో సుధీర్ కనిపించనున్నాడని అనిపిస్తోంది. మరి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రంలో కృతి గురించి సుధీర్ ఏం చెప్తాడో సెప్టెంబర్ 16న తెలుస్తుంది. 

బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.