English | Telugu
కొంపముంచుతున్న తమిళ దర్శకులు!
Updated : May 12, 2023
ఇటీవల వరుస ప్లాప్ లు ఎదుర్కొంటున్న అక్కినేని ఫ్యామిలీని మరో ప్లాప్ పలకరించింది. నాగచైతన్య నటించిన 'కస్టడీ'తో ఈ ప్లాప్ లకు బ్రేక్ పడుతుంది అనుకుంటే.. ఈరోజు విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీ ప్లాప్ ల పరంపరకు ఎప్పుడు బ్రేక్ పడుతుందా అని ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో తమిళ్ దర్శకులతో తెలుగు హీరోలు చేస్తున్న సినిమాలు నిరాశ పరుస్తున్నాయనే చర్చలు కూడా జరుగుతున్నాయి.
కొందరు తెలుగు హీరోలు తమిళ దర్శకులతో సినిమా చేస్తే.. అక్కడ కూడా తమ మార్కెట్ పెరుగుతుందని భావించి సినిమాలు చేస్తున్నారు. తీరా విడుదలయ్యాక చూస్తే తమిళ్ మాట అటుంచితే, తెలుగులో కూడా ఘోర పరాజయం పాలవుతున్నాయి. రామ్ పోతినేని గతేడాది లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్' చేసి చేతులు కాల్చుతున్నాడు. ఇక ఇప్పుడు నాగ చైతన్య వంతు వచ్చింది.
నాగ చైతన్య గతంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'ఏ మాయ చేశావే', 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలు చేయగా.. అందులో 'ఏ మాయ చేశావే' మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన 'కస్టడీ'పై చైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని, కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మాడు. కానీ ఈ సినిమాకి దారుణమైన నెగటివ్ టాక్ వస్తోంది. రామ్ సైతం 'ది వారియర్'పై అంతే నమ్మకం పెట్టుకోగా నిరాశపరిచింది. ఇప్పుడు చైతన్య విషయంలోనూ అదే రిపీటైంది. గతంలోనూ తమిళ దర్శకులతో తెలుగు హీరోలు చేసిన మెజారిటీ సినిమాలు నిరాశపరిచాయి. మరి ఈ నెగటివ్ సెంటిమెంట్ కి భవిష్యత్ లో బ్రేక్ పడుతుందేమో చూడాలి.