English | Telugu
Kannappa: అంచనాలు తలకిందులు.. షాకిచ్చిన కన్నప్ప..!
Updated : Jun 27, 2025
హిస్టారికల్, మైథలాజికల్ జానర్స్ లో సినిమాలు చేయడం అంత తేలిక కాదు. ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా ప్రకటన సమయంలో పాజిటివ్ బజ్ ఉండేది. టీజర్ రిలీజ్ తర్వాత అది పూర్తి నెగటివ్ గా మారింది. సినిమా విడుదలయ్యాక కూడా అదే కొనసాగింది. అయితే ఇప్పుడు 'కన్నప్ప' విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది.
మంచు ఫ్యామిలీ కన్నప్ప సినిమా ప్రకటించినప్పటి నుంచి నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. వాటన్నింటినీ తట్టుకొని నిలబడి సినిమాని పూర్తి చేశారు. ఫస్ట్ లుక్, టీజర్ విడుదల తర్వాత కూడా ఆ నెగటివిటీ అలాగే ఉంది. సాంగ్స్ రిలీజ్ తర్వాత నుంచి ఆ నెగటివిటీ తగ్గుతూ వచ్చింది. ఇక ట్రైలర్ ఆకట్టుకోవడంతో.. కాస్త పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయినప్పటికీ కన్నప్ప అవుట్ పుట్ పై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. వాటన్నంటినీ తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన కన్నప్ప చిత్రం.. పటాపంచలు చేసింది.
ఇప్పటికే చాలా చోట్ల కన్నప్ప మొదటి షోలు పూర్తయ్యాయి. అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాకే వస్తోంది. పూర్తిగా బాగాలేదు అనే టాక్ అయితే ఎక్కడా లేదు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా నడిచినప్పటికీ, ఇంటర్వెల్ ముందు వేగం పుంజుకుందని, ముఖ్యంగా సెకండాఫ్ అదిరిపోయిందని అంటున్నారు. చివరి 30 నిమిషాలు అద్భుతంగా ఉందని, విష్ణు తన నటనతో ఆశ్చర్యపరిచాడని చెబుతున్నారు. రుద్రగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించిన తీరు కట్టిపడేసిందనే మాటలు వినిపిస్తున్నాయి.
ఈ తరం వారికి కన్నప్ప గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అలాగే శివ భక్తులు ఈ సినిమా చూడటానికి మక్కువ చూపే అవకాశముంది. అలాగే నార్త్ లోనూ డివోషనల్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. కన్నప్పకి వస్తోన్న పాజిటివ్ టాక్ కి తోడు.. ఈ అంశాలు కూడా కలిసొస్తే.. సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంది అనడంలో సందేహం లేదు.
ఏది ఏమైనా విడుదలకు ముందు ఎంతో నెగటివిటీని మోసిన కన్నప్ప.. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి.