Read more!

English | Telugu

20 ఏళ్ళు పూర్తి చేసుకున్న 'చెన్నకేశవ రెడ్డి'

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో 'చెన్నకేశవ రెడ్డి' ఒకటి. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2002న విడుదలై ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. థియేటర్లలో మాస్ జాతర సృష్టించిన ఈ సినిమా విడుదలై నేటితో 20 ఏళ్ళు పూర్తయింది.

 

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా అంటే ముందుగా మనకు బాలయ్యే గుర్తొస్తాడు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ ఎవరూ మ్యాచ్ చేయలేని విధంగా ఉంటాయి. అప్పటికే 'సమరసింహా రెడ్డి'(1999), 'నరసింహ నాయుడు'(2001)తో ఇండస్ట్రీ హిట్స్ అందుకొని జోరు మీదున్న బాలయ్య.. 'చెన్నకేశవ రెడ్డి'తో మరోసారి వెండితెరపై వీర విహారం చేశాడు. ద్విపాత్రాభినయంతో బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. ఈ చిత్రంలో 'శరభ శరభ' అనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాలయ్య నడిచొస్తుంటే థియేటర్లలో మోత మోగిపోయింది. 'సౌండ్ చేయకు కంఠం కోసేస్తా' వంటి డైలాగ్స్ ఫ్యాన్స్ ని గోల చేసేలా చేశాయి. ఇక సత్తి రెడ్డి సీన్ అయితే మాస్ కి గూజ్ బంప్స్ తెప్పించింది. బాలయ్య కెరీర్ లో ఎన్ని యాక్షన్ సినిమాలున్నా అభిమానుల హృదయాల్లో 'చెన్నకేశవ రెడ్డి'కి ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది.

 

శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రంలో టబు, శ్రియా సరన్, జయ ప్రకాష్ రెడ్డి, ఆనంద్ రాజ్, చలపతి రావు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఆయన స్వరపరిచిన పాటలన్నీ మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ ఆకట్టుకుంది. ఇప్పటికీ 'చెన్నకేశవ రెడ్డి' పేరు వింటే ముందుగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరే గుర్తుకొస్తుంది. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే వినాయక్ అందించగా, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. సినిమాటోగ్రాఫర్ గా అజయ్ విన్సెంట్, ఎడిటర్ గా గౌతమ్ రాజు వ్యవహరించారు.