Read more!

English | Telugu

సినిమా పేరు:ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
బ్యానర్:పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 17, 2023

సినిమా పేరు: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
తారాగణం: నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు తదితరులు
సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ
ఎడిటర్: కిరణ్ గంటి
లిరిక్స్: భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కఫీఫీ సాంగ్)
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్
విడుదల తేదీ: మార్చి 17, 2023

'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' సినిమాలతో ఆకట్టుకున్న యువ హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో రూపొందిన హ్యాట్రిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. హిట్ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడం.. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మంచి ఈ చిత్రం ఎలా ఉంది? నాగశౌర్య- శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ కి హ్యాట్రిక్ విజయాన్ని అందించేలా ఉందా?.

కథ:

సంజయ్(నాగశౌర్య) యూకేలో రెస్టారెంట్ నడుపుకుంటూ ఉంటాడు. ఒకసారి అక్కడికి తన మాజీ ప్రేయసి అనుపమ(మాళవిక నాయర్) వస్తుంది. సంజయ్ మాట్లాడించడానికి ప్రయత్నించినా అనుపమ ఎవరో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా ప్రవర్తిస్తుంది. అసలు సంజయ్, అనుపమ ఎవరు? వారి పరిచయం ఎలా జరిగింది? ఆ పరిచయం స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా ఎలా మారింది? పదేళ్ల పాటు ఏడు దశల్లో జరిగిన వారి ప్రేమ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమున్నా విడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సంజయ్ జీవితంలోకి వచ్చిన పూజ(మేఘా చౌదరి), అనుపమ జీవితంలోకి వచ్చిన గిరి(శ్రీనివాస్ అవసరాల) పాత్రలు ఏంటి? చివరికి సంజయ్, అనుపమ కలుసుకున్నారా? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

ఒక చిన్న కథను తీసుకొని దానిని ఆసక్తికరమైన కథనం, అందమైన సన్నివేశాలు, సంభాషణలతో నడిపించడం శ్రీనివాస్ అవసరాల శైలి. ఈ సినిమాతో కూడా అదే ప్రయత్నం చేశారు శ్రీనివాస్. అయితే గత చిత్రాలతో పోల్చుకుంటే కనీసం కథగా చెప్పుకోవడానికి కూడా ఈ సినిమాలో పెద్దగా ఏమిలేదు. కొన్ని సన్నివేశాల మేళవింపు అన్నట్లుగా ఈ సినిమా ఉంది. హీరోహీరోయిన్ల ప్రేమ ప్రయాణాన్ని ఏడు దశల్లో చూపించారు. అందువల్ల తెర మీద ఒక కథ చూసిన భావన కలగదు.. కొన్ని సన్నివేశాలు కలిపి చూసిన భావన కలుగుతుంది.

శ్రీనివాస్ గత చిత్రాలు సరదా సన్నివేశాలు, సంభాషణలతో ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఉంటాయి. కానీ ఇందులో ఆ హాస్యం కొరవడింది. ఏదో ఒకటి అరా తప్ప నవ్వు తెప్పించే సన్నివేశాలు పెద్దగా ఉండవు. ఈ చిత్రంలో ఎక్కువగా ఎమోషన్స్ మీద దృష్టి పెట్టాడు దర్శకుడు. అయితే అవి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు. హీరో, హీరోయిన్ ల మధ్య ప్రేమ సన్నివేశాలు కట్టిపడేసేలా లేవు. వాళ్ళు విడిపోయే పరిస్థతి రావడానికి గల కారణం కూడా అంత బలంగా అనిపించదు.

ఈ చిత్రం చాలా సహజంగా ఉంటుందని ముందు నుండి చిత్ర బృందం చెబుతూ వచ్చింది. నిజంగానే దాదాపు సన్నివేశాలు, సంభాషణలు అన్ని సహజంగా ఉండేలా చూసుకున్నారు. అయితే ఆ సహజత్వమే కొన్ని కొన్ని చోట్ల విసిగించేలా ఉంది. బలమైన కథాకథనాలకు సహజమైన సన్నివేశాలు తోడైతే ఫలితం బాగుంటుంది. కానీ ఓ కథలా కాకుండా కేవలం కొన్ని సంఘటనను, సందర్భాలను తీసుకొని.. వాటిని ఎంత సహజంగా చెప్పినా పూర్తిస్థాయిలో మెప్పించలేమనే విషయాన్ని దర్శకుడు గ్రహించలేకపోయాడు.

కళ్యాణి మాలిక్ స్వరపరిచిన 'కనుల చాటు మేఘమా', 'నీతో ఈ గడిచిన కాలం' పాటలు ఆకట్టుకున్నాయి. సన్నివేశాల్లో నటీనటుల సంభాషణలు, చుట్టూ పరిసరాల ధ్వనులు తప్ప.. నేపథ్య సంగీతం వినిపించిన సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. అయితే సన్నివేశాలు సహజంగా ఉండాలనే దర్శకుడి ఆలోచనకు తగ్గట్లుగా.. అవసరమైన చోట మాత్రం తన సంగీతంతో కళ్యాణి మాలిక్ మెప్పించారు. సునీల్ కుమార్ నామ కెమెరా పనితనం, కిరణ్ గంటి కూర్పు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

సంజయ్ పాత్రలో నాగశౌర్య ఒదిగిపోయాడు. పదేళ్ల పాటు ఏడు దశల్లో జరిగే కథలో.. తన ఆహార్యం, అభినయంతో వయసుకి తగ్గట్లుగా వైవిధ్యాన్ని చక్కగా ప్రదర్శించాడు. అనుపమ పాత్రలో మాళవిక నాయర్ ఎప్పటిలాగే సహజంగా నటించింది. భావోద్వేగాలను చక్కగా పలికించింది. అనుపమను ఇష్టపడే గిరి పాత్రలో శ్రీనివాస్ అవసరాల, సంజయ్ ని ఇష్టపడే పూజ పాత్రలో మేఘ చౌదరి రాణించారు. అభిషేక్ మహర్షి, హరిణి రావు ఉన్నంతలో బాగానే నవ్వించారు. సినిమాలో ఈ రెండు పాత్రలు కాస్త రిలీఫ్ అని చెప్పొచ్చు. అశోక్ కుమార్, శ్రీ విద్య, వారణాసి సౌమ్య తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

తన గత చిత్రాలు 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' స్థాయిలో దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మెప్పించలేకపోయారు. నాగశౌర్య-మాళవిక జోడి కోసం.. అవసరాల మార్క్ కొన్ని సన్నివేశాలు, సంభాషణల కోసం ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు.

-గంగసాని