English | Telugu
ఈరోజు శ్రీవారికి... ఐదున అమ్మవారికి... పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్
Updated : Sep 30, 2019
తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై దేవీ నవరాత్రి శోభ దేదీప్యమానంగా కనిపిస్తోంది. కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకావడంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దాంతో ఇందకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక, ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... అక్టోబర్ 5న అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
అదే సమయంలో, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అంకురార్పణతో మొదలైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 9వరకు జరగనున్నాయి. ఇక, బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తోంది. దాదాపు 6వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, తిరుమల నడకదారుల్లో 1650 సీసీ కెమెరాలతో నిఘాపెట్టారు. ఇక గదుల కేటాయింపు, దర్శనాల్లో సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తామని టీటీడీ ఈవో చెప్పుకొచ్చారు.
ఇక, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తిరుమల వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక, రాత్రికి తిరుమలలోనే బసచేయనున్న సీఎం జగన్... రేపు ఉదయం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.