English | Telugu

చిన్నాన్న చిన్నాన్నే.. టార్గెట్ టార్గెట్టే...

లోకల్ వార్ లో ప్రూవ్ చేసుకోవటం తప్పదని తేల్చి చెప్పిన జగన్!

ముగ్గురు పెద్ద రెడ్లకూ ప్రాంతాల వారీగా బాధ్యతలు....

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హోమ్ వర్క్ తో అటు పార్టీ నాయకులూ, ఇటు మంత్రులు నానా కుస్తీలు పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతను నేరుగా మంత్రులకు అప్పగించటమే కాకుండా, ముగ్గురు పెద్ద రెడ్లు- విజయసాయి రెడ్డి, వై వి సుబ్బా రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి లకు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు, రాయలసీమ బాధ్యతలను అప్పగించారు. అంటే, సన్నిహితులైనప్పటికీ, రిజల్ట్ ఓరియెంటెడ్ గా ఉంటేనే పదవులు గానీ, రాజకీయ మనుగడ గానీ ఉంటాయనే సంకేతాలను ఆయన చాలా బలంగా ఈ ముగ్గురు పెద్ద రెడ్లకూ కమ్యూనికేట్ చేశారు. చిన్నాన్న చిన్నాన్నే, వ్యవహారం వ్యవహారమే అని తేల్చి చెప్పేశారు.

వీళ్ళ సంగతే ఇలా ఉంటె, ఇహ మంత్రుల విషయం చెప్పనక్కర్లేదు మరి అంటున్నారు పార్టీ క్యాడరు, నాయకులూ కూడా. పార్టీ మంత్రులకు, ముఖ్య నేతలకు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టారు. మంత్రులకైతే ఏకంగా పదవులకే ఎసరు పెట్టారు. ప్రతిఒక్కరు గెలుపు కోసం పని చెయ్యాలని సూచించారు . అంతే కాకుండా పార్టీలోని కీలక నేతలకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించారు జగన్. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి, ఉభయగోదావరి జిల్లాల బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి, రాయలసీమ బాధ్యతలు సజ్జల రామకృష్టారెడ్డికి అప్పగించారు. కేవలం గెలుపు మాత్రమే కాదు.. బంఫర్ మెజారిటీ సాధించాలని , అది కూడా సార్వత్రిక ఎన్నికల కంటే గొప్పగా ఉండాలని భావిస్తున్న వైసీపీ ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకూడదని కసరత్తులు చేస్తోంది వై ఎస్ ఆర్ సి . ఇంతకీ వైసీపీ బలం ఏంటి ? క్లీన్ స్వీప్ చేసేలా ప్రజలు వై ఎస్ ఆర్ సి పి ని ఆదరిస్తారని ఎలా అనుకుంటుంది ? అనే ప్రశ్నలు ప్రస్తుతం అమరావతి కారిడార్లలో షికార్లు చేస్తున్నాయి.

'లోకల్ వార్' కు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్న వై ఎస్ ఆర్ సి పి, ఈ ఎన్నికల ద్వారా ప్రతిపక్ష పార్టీల నోటికి తాళాలు వెయ్యటం . ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించటం అనే రెండు టార్గెట్లను మంత్రుల, కీలక నాయకుల ముందుఉంచింది. క్షేత్ర స్థాయిలో మంత్రుల నుంచి సామాన్య కార్యకర్త వరకూ ఈ ఎన్నికల్లో బంఫర్ మెజారిటీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్న వైసీపీ అందుకు కావల్సిన అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు చెక్ పెట్టేలా నిఘా యాప్ ను కూడా ప్రారంభించింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. మంత్రుల నుంచి సామాన్య కార్యకర్త వరకూ ఎన్నికల క్షేత్రంలో వ్యూహాత్మకంగా అధినేత ఆదేశాల మేరకు ముందుకు వెళ్తున్నారు.ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలకు చెక్ పెట్టేలా ముందే ప్రతిపక్ష పార్టీల నేతలకు గాలం వేస్తూ వలసలను ప్రోత్సహిస్తోంది కూడా. . ముఖ్యంగా టీడీపీ ముఖ్య నాయకులను , మాజీ మంత్రులను పార్టీ లో చేర్చుకుని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊపిరాడకుండా చేస్తుంది . పులివెందుల సతీష్ రెడ్డి చేరికతో కడప జిల్లాలో ఏకపక్ష విజయాలను ఆవిష్కృతం చేయాలనేది వై ఎస్ ఆర్ సి పి ఆలోచన.