English | Telugu
క్రెడిట్ చోరీ కోసమేగా వైసీపీ ఏడుపంతా?
Updated : Nov 7, 2025
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిడిట్ చోరీ అంటూ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. అయితే అసలు క్రెడిట్ చోరీ కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ నవ్వుల పాలౌతున్నది ఆయననేనని తాజాగా మరోసారి రుజువైపోయింది.
ఇంతకీ విషయమేంటంటే.. ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్.. సంక్షేమం, అభివృద్ధి, విపత్తు సమయాలలో ప్రజలను ఆదుకోవడం.. ఇలా అన్ని విషయాలలోనూ ప్రజల మెప్పు పొందుతోంది. అదే సమయంలో జగన్ హయాంలో ఏం జరిగింది, ఆ ప్రభుత్వం ఎంత నిష్పూచీగా వ్యవహరించింది అన్న చర్చ కూడా జనంలో జోరుగా సాగుతోంది. దీంతో దిక్కు తోచని స్థితిలో వైసీపీ నాయకులు అయినదానికీ కాని దానికీ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలలో మరింత చులకన అవుతున్నారు. తాజాగా మహిళల వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీమ్ ఇండియా జట్టు సభ్యురాలు శ్రీచరణి ప్రభుత్వం పట్టించుకోలేదంటూ వైసీపీ విమర్శల రాగం మొదలు పెట్టింది. శ్రీచరణిని ఏపీ సర్కార్ పట్టించుకోలేదంటూ గగ్గోలు పెట్టేసింది. శ్రీకాంత్ రెడ్డి అయితే ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ ప్రభుత్వాన్ని విమర్శించేశారు.
ఇంతకీ శ్రీచరణి వరల్డ్ కప్ విజయం తరువాత శుక్రవారం (నవంబర్ 7) రాష్ట్రానికి తిరిగి వచ్చారు. గురువారం (నవంబర్ 6) ఆమె హస్తినలో ప్రధాని మోడీ నివాసంలో జట్టు సభ్యులతో పాటు ఉన్నారు. అంటే శ్రీచరణి రాకముందే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వైసీపీ గగ్గోలు పెట్టేయడం మొదలు పెట్టేసింది. సొంత మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేసేసింది. ఇక్కడ వైసీపీ దుగ్ధ అంతా ఎలాగూ ప్రభుత్వం శ్రీచరణికి భారీగా నజరానాలు ప్రకటిస్తుంది. అయితే ప్రభుత్వం అలా ప్రకటించడానికి తామే కారణమన్న క్రెడిట్ కొట్టేయడానికే వైసీపీ ఇలా వ్యవహరించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సరే జరిగిందేమిటంటే.. శ్రీ చరణి శుక్రవారం (నవంబర్ 7) రాష్ట్రానికి వచ్చారు. ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి నేరుగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సందర్భంగా చంద్రబాబు ఆమెను అభినందించారు. ఆ వెంటనే రెండున్న కోట్ల నగదు బహుమతి, గ్రూప్1 స్థాయి ప్రభుత్వోద్యోగం, ఆమె స్వస్థలం కడపలో వెయ్యి గజాల నివాసస్థలం ఇస్తున్నట్లు ప్రకటన వెలువడింది. కడపలో ఆమెను ఘనంగా సత్కరించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ సహజంగా జరిగేవే. క్రీడల పట్ల, క్రీడాకారులను ప్రోత్సహించడం పట్ల చంద్రబాబు ఎంత ప్రోయాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు ప్రభుత్వం శ్రీచరణికి నజరానాలు ప్రకటిస్తుందన్న విషయం తెలిసిన వైసీపీ ముందుగానే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పించేసి.. ఇప్పుడు తాము గట్టిగా మాట్లాడడం వల్లనే చంద్రబాబు సర్కార్ శ్రీచరణికి నజరానాలు ఇచ్చిందని చెప్పుకుని క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసిందని అంటున్నారు.
అయితే క్రెడిట్ చోరీకి వైసీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందంటున్నారు. ఎందుకంటే.. వైసీపీ హయాంలో రాష్ట్రంలో క్రీడలను ఇసుమంతైనా ప్రోత్సహించలేదు. క్రీడాకారులకు ఎటువంటి సౌకర్యా లూ కల్పించలేదు సరికదా.. ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలను వైసీపీ నేతలు దండుకున్నారు. అంతే కాదు చంద్రబాబు చేపట్టిన గాండీవం ప్రాజెక్టులో భాగంగా ఏపీ ప్లేయర్లకు ట్రైనింగ్ ఇచ్చిన కంపెనీకి బిల్లులు ఎగ్గొట్టడమే కాకుండా, శిక్షణను సైతం వైసీపీ సర్కార్ నిలిపివేసింది. ఇప్పుడు శ్రీచరణి విషయంలో వైసీపీ చంద్రబాబు సర్కార్ పై చేస్తున్న విమర్శల నేపథ్యంలో జనం నాడు జగన్ ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రస్తావిస్తూ నవ్వుకుంటున్నారు.