English | Telugu
అద్దంకిలో వైసీపీ మరో ప్రయోగం.. ఇన్చార్జ్‌గా పల్నాడు డాక్టర్ అశోక్
Updated : Nov 7, 2025
అద్దంకి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు అక్కడ తిరుగులేని పట్టుంది. అద్దంకి ఆయన సొంత నియోజకవర్గం కాకపోయినా, తనకు స్థానికంగా ఉన్న పరిచయాలతో, ఆయన 2009లో సొంత నియోజకవర్గమైన మార్టూరు నియోజకవర్గం రద్దు కావటంతో అద్దంకి వచ్చి గట్టి పాగానే వేశారు. ప్రజలతో మమేకమై ప్రజాభిమానాన్ని పొంది ఓటమెరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 నుండి 2024 వరకు ఓటమన్నదే ఎరగకుండా.. పార్టీతో సంబంధం లేకుండా ఐదు సార్లు విజయం సాధించిన అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్.
2004వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చిన రవికుమార్ మార్టూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సోదరుడు గొట్టిపాటి నరసయ్యపై విజయం సాధించారు. 2009 ఎన్నికలలో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరాంపై విజయ ఢంకా మోగించారు. 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరిన రవికుమార్ బలరాం కుమారుడు కరణం వెంకటేష్ పై పోటీ చేసి విజయం సాధించారు. అనంతర పరిణామాలలో గొట్టిపాటి ఫ్యాను పార్టీని వీడి సైకిల్ ఎక్కారు.
2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైసిపి అభ్యర్థి గరటయ్యపై మరో గెలుపు సొంతం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పాణెం హనిమిరెడ్డిపై భారీ విజయం సాధించి ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందటమే కాకుండా విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.2014 పార్టీ ఆవిర్భావంలో గొట్టిపాటి రవి చలవతో అద్దంకి నుంచి విజయం సాధించిన వైసీపీ తిరిగి అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తోంది గాని ఫలితం లేకుండా పోతుంది. ప్రతి ఎన్నికలకు అభ్యర్థిని మారుస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఫలితాలతో నిరాశ చెందుతోంది.
2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన పాణెం హనిమిరెడ్డి ఎన్నికల అనంతరం పెట్టా బేడా సర్దేశారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ సత్తా ఉన్న నేత కావాలి అంటూ పలు ప్రయత్నాలు చేసారు. ఆ క్రమంలో పక్కనున్న పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ అశోక్‌ను అద్దంకి వైసీపీ ఇన్చార్జ్‌గా నియమించారు. వైసిపి వైద్య విభాగపు నేతగా జగన్ దగ్గర గుర్తింపు తెచ్చుకున్న అశోక్ అద్దంకిలో తన సత్తా చూపిస్తానంటూ అధినేతకు మాటిచ్చి వచ్చారంట. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలనైతే ముమ్మరం చేశారు. అద్దంకిలోని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న అశోక్ ప్రతి విషయంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది టిడిపి నేతలను కూడా తన వైపునకు తిప్పుకునేందుకు పలు ప్రయత్నాలు మొదలుపెట్టారంట.అద్దంకి పట్టణానికి చెందిన 50 కుటుంబాలను పార్టీలోకి చేర్చుకొని అధినేత దగ్గర మంచి మార్కులే వేయించుకున్నారంటున్నారు.
స్థానిక నేతలకు అందుబాటులో ఉంటూ అద్దంకిలో అశోక్ తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తుఫాను సమయంలో అధికారులు గుండ్లకమ్మలో చిక్కుకుపోతే వారిని కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని తాను ప్రజలకు దగ్గరగా ఉన్నానని సంకేతాలను పంపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి ఎరగని నేతగా తనదైన రాజకీయ చాతుర్యంతో దూసుకుపోతున్న గొట్టిపాటి రవి కుమార్ ముందు అశోక్ ఎంతవరకు సక్సెస్ అవుతారు అనే అనుమానాలనైతే అద్దంకి ప్రజలు వ్యక్తపరుస్తున్నారట. రాజకీయ ఉద్దండుడు ప్రజా నేతగా గుర్తింపు ఉన్న గొట్టిపాటి రవికుమార్‌ను అశోక్ ఎంతవరకు ఎదుర్కోగలరు అనే అనుమానాలను సొంత పార్టీ నేతలే వ్యక్తపరుస్తున్నారంట. ఎన్నికలకు చాలా సమయం ఉందని అప్పటి వరకు నిలకడగా పనిచేసి, ప్రజలతో మమేకమై భరోసా కల్పిస్తే అద్దంకిలో సక్సెస్ కావడం పెద్ద కష్టం కాదని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆరంభ శూరత్వమో ... చివరి వరకు పోరాడే తత్వమో తెలియదు కానీ తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలను అయితే అటు అధిష్టానంతో పాటు ఇటు అద్దంకి ప్రజానీకానికి కూడా అశోక్ పంపే ప్రయత్నం చేస్తున్నారు.
కొందరు సొంత పార్టీ నేతలు సరైన నాయకుడు వచ్చాడు అంటూ చెప్పుకుంటుండగా, మరికొందరు మాత్రం ఐరావతం ముందు ఎలుక పిల్ల ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతుందనే విమర్శలు కూడా చేస్తున్నారట. అయితే రాజకీయాలలో ఎవరూ శాశ్వతం కాదని ... ట్రెండ్... ప్రజానాడి ఎవరు పట్టగలిగితే వారే సక్సెస్‌ఫుల్ నేతలని ఎన్నో సందర్భాలలో రుజువైందని ... తాను కూడా అదే విధంగా విజయం సాధిస్తానంటూ అశోక్ సొంత పార్టీ నేతలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న చందంగా సొంత పార్టీ నేతలకు నమ్మకం భరోసా కల్పించి తరువాత తన సత్తా ఏంటో అద్దంకి నియోజకవర్గానికి చూపాలనే భావనలో అశోక్ ఉన్నారట. మరి ఎంతవరకు ఈ డాక్టర్ అద్దంకి ప్రజల నాడిని పట్టగలుగుతారో చూడాలి .