English | Telugu

ఏంటి సవాంగ్ సాబ్.. మరీ సినిమా డాక్టర్ లాగా!! 

చాలా సినిమాల్లో కామన్ గా కనిపించే హాస్పిటల్ సన్నివేశాల్లో డైలాగ్స్ ఎలా ఉంటాయి? హీరో తలకు బలమైన గాయం తగిలి హాస్పిటల్ ఐ సి యూ లో ఉంటాడు. బయట ఎర్ర లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇంతలో హీరో గారి మదర్ డబ్బాడు కుంకుమ జయంతి గారు, నోట్లో గుడ్డలు కుక్కుకుంటూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది.. ఆమె వెంబడే హీరో గారి భార్య జయసుధ గారో, లేక మరొక హీరొయినో ఒగరుస్తూ అక్కడకు చేరుకుంటారు... ఆ వెంటనే ఐ సి యు లో నుంచి డాక్టర్ బయటకు వచ్చి..ఆ గాయపడిన వ్యక్తి తాలూకు బంధువులెవరైనా ఉన్నారా అని కంగారుగా అడుగుతారు ( ఆయనకు లోపల ఉన్నది హీరో అని తెలియదు గదా..ఎవరో సాధార వ్యక్తి అనుకుని అలాప్రశ్నిస్తారు) . జయంతి గారు, జయసుధ గారు వెంటనే ...ఏమయింది డాక్టర్ అంటూ..ఆయన్ను చుట్టు ముట్టేస్తారు.. " ఆయన మాత్రం ఏ విషయం 24 గంటల దాకా చెప్పలేము... మీరేమీ కంగారు పడనక్కర్లేదు ..అంటూ అక్కడ నుంచి హడావుడిగా వెళ్లిపోతారు... ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన డి జి పీ గౌతమ్ సవాంగ్ గారు ఆ పాత సినిమాల్లో డాక్టర్ లాగా.. ఏ ప్రశ్న అడిగినా.. పరిస్థితి అదుపులో ఉందనో... లేక, పోలీసులు తగు విధం గా రెస్పాండ్ అవుతున్నారనే మాత్రమే చెప్పి, అప్పటికి అలా కానించేస్తున్నారు. వాస్తవానికి తలా పగిలిన న్యాయవాది, అలాగే ఎండ ముఖమెరుగని బుద్ధ వెంకన్న, బోండా ఉమా మహేశ్వర రావు లకు మాచర్లలో ఎదురైన భయానక స్థితి గురించి మాత్రం గౌతమ్ సవాంగ్ మాట్లాడరు . ఇదే కాదు రాష్ట్రంలో అదుపు తప్పిన లా ఎండ్ ఆర్డర్ గురించి కూడా మాట్లాడరు.... కోర్టు లో ఉన్నందు వల్ల, మాట్లాడలేనంటూ ముఖం తిప్పేస్తారు. యాంటీ నక్సల్ ఆపరేషన్స్ లో మీదైన శైలి తో గుర్తింపు తెచ్చుకున్న సవాంగ్ గారూ.....ఆంధ్ర ప్రజలు మీ నుంచి ఈ స్థాయి పోలీసింగ్ అయితే ఆశించటం లేదు.

ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దీనితో టీడీపీ వైసీపీ నేతల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న బోండా ఉమాలపై దాడి ఘటన రాష్ట్రంలో దుమారం రేపింది . నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంటున్నారని నామినేషన్ పత్రాలు చించి వేశారని దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక ఈ ఘటన నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు గవర్నగర్ బిస్వభూషణ్ హరిచందన్ కు అలాగే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు .రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.

ఇక ఈ ఘటనపై హై కోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు సైతం డీజీపీని కోర్టుకు పిలిచి మరీ విచారణ జరిపింది. ఇకపోతే ఈ ఘటన తరువాత డీజీపీ గౌతమ్ సవాంగ్ అసలు సంఘటనపై నివేదిక కావాలని సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీ సవాంగ్ గుంటూరు ఐజీని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో గుంటూరు ఐజీ ఈ ఘటన పై పూర్తి నివేదిక ఇచ్చారు. ఇక దీనిపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ ఘటనకు బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రతి పక్ష పార్టీ సహా అన్ని పార్టీల నాయకులు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని వచ్చిన అన్ని ఫిర్యాదులపైన తక్షణమే విచారణ జరిపిస్తున్నామని చెప్పిన ఆయన అంతే కాక ఘటన వివరాలు దర్యాప్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి అందిస్తున్నామని డీజీపీ తెలిపారు. మాచర్ల ఘటన పైన సెక్షన్ 307 కింద నమోదు చేయలేదని ప్రతిపక్ష పార్టీల వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. మాచర్ల ఘటనపై సెక్షన్ 307 కింద నిందితులను అరెస్టు చేశామని ప్రస్తుతము గురజాల సబ్-జైల్లో ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు నిందితులు ఉన్నారని పోలీసులకు సమాచారం ఇచ్చిన తరువాతే వెళ్లామని టిడిపి నేతలు బోండా ఉమా బుద్దా వెంకన్న చెప్పారని దాని మీద కూడా విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఏన్నికల దృష్టా పోలీసులు అన్నివేళల అప్రమత్తంగా ఉన్నారని ఎక్కడ ఏ సంఘటన జరిగినా తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.