English | Telugu
విశాఖ శారదాపీఠంలో యోగవాసిష్టం యాగాలు
Updated : Mar 17, 2020
కరోనా వైరస్ నిర్మూలన కోసం 11 రోజులపాటు సాగనున్న యజ్ఞయాగాదులు
యాగం నేపథ్యంలో విశాఖ శారదాపీఠం చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర వాయిదా
రాజమండ్రిలో యాత్ర ముగించుకుని విశాఖ బయలుదేరిన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి
సామాజిక స్పృహతో ఈ యోగ వాసిష్ఠం సూచించిన యాగం చే పట్టినట్టు స్వామి స్వాత్మానందేంద్ర 'తెలుగు వన్ ' కు చెప్పారు. శాస్త్ర గ్రంధాల్లో సూచించిన మేరకు యాగం నిర్వహిస్తామన్నారు. ఆరోగ్యకరమైన సమాజమే విశాఖ శారదాపీఠం ఆకాంక్ష అని స్వామి స్వాత్మానందేంద్ర వివరించారు. నిజానికి యోగవాసిష్ఠం లో కర్కటి ఉపాఖ్యానం అని ఒక అధ్యాయం ఉంది. కర్కటి అనేది ఓ మహారాక్షసి . దానిది అంతులేని ఆకలి. ఎన్ని వందల, వేల మంది మనుషుల్ని అప్పడాల్లా నమిలేసినా దానికి ఆకలి తీరేది కాదు. ఇలా కాదు; భూలోకంలోని సమస్త ప్రాణులనూ ఒకే సారి మింగ గలిగితే ఎంత బాగుండు ! అప్పుడు కానీ నాకు కడుపు నిండదు – అని ఆ రాక్షసికి ఓ చిన్న కోరిక పుట్టింది. ఎడతెగని ఆకలి బాధ తీరటానికి అదొక్కటే దారి అని దానికి తోచింది. ఎలాగైనా దాన్ని సాధించి తీరాలని ఒంటికాలి మీద నిలబడి తీవ్రమైన తపస్సు చేసింది. హిమాలయ శిఖరం మీద వెయ్యేళ్ళ పాటు సాగిన రాక్షసి భీకర తపస్సు ధాటికి లోకాలు అల్లాడాయి. బ్రహ్మదేవుడు దిగివచ్చి వరం కోరుకోమన్నాడు.
“ముక్కు ద్వారా వాసన లోపలికి పోయినంత తేలిగ్గా నేను వ్యాధి రూపంలో మనుషుల హృదయం లోకి ప్రవేశించాలి. జీవమున్న సూదిలా సూక్ష్మరూపంలో వ్యాపించి ప్రపంచంలోని జీవులను కడుపారా భోం చేయాలి. ఆ ఒక్క వరమివ్వు చాలు “అన్నది కర్కటి. బ్రహ్మగారు సరే అన్నాడు. నువ్వు కోరుకున్నట్టే సూక్ష్మాతి సూక్ష్మమైన సూది రూపంలో ‘విషూచిక’ అనే పేరుగల వాత రోగానివి అవుతావు. ప్రజల ప్రాణవాయువుద్వారా ముక్కులోంచి ప్రవేశించి మనుషుల హృదయప్రదేశాన్ని ఆక్రమిస్తావు. గుండె, కాలేయం ,ఊపిరితిత్తులు లాంటి అవయవాలను పీడించి వారిని నాశనం చేస్తావు ‘ అని వరమిచ్చాడు. అయితే దానికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి అన్నాడు.
అవేమిటంటే , తినకూడని వాటిని తినేవారిని, చెయ్యకూడని పనులు చేసేవారిని , చెడు ప్రదేశాల్లో ఉండేవారిని , శాస్త్రవ్యతిరేకంగా నడిచేవారిని, దుర్మార్గులను సుబ్బరంగా హింసించి ఆరగించవచ్చు.మాయరోగం అన్నది వ్యాపించాక , చెడ్డవాళ్ళతో పాటు మంచి వాళ్ళూ దాని బారిన పడతారు. అయితే దానినుంచి బయటపడటానికి బ్రహ్మగారు మంత్రరూపంలో ఓ ఎస్కేప్ రూట్ ఇచ్చాడు. ఆ మంత్రాన్ని శ్రద్ధగా అనుష్ఠిస్తే చాలు గుణవంతులు విషూచికావ్యాధి కోరలనుంచి తప్పించుకోగలరట!
వేల సంవత్సరాల కిందటి యోగ వాసిష్ఠంలోని ఉత్పత్తి ప్రకరణం లో ఈ కథవింటే దానికీ మనలను ఇప్పుడు వొణికిస్తున్న కరోనా వైరస్ కూ చాలా పోలికలు కనిపిస్తాయి. ఈ వైరస్ కూడా ముక్కుద్వారానో , మూతిద్వారానో , చేతుల ద్వారానో ప్రాణవాయువుతోబాటు లోపలికి పోయి గుండెలోనో, దానిదగ్గరి ఊపిరి తిత్తులలోనో, పక్క వాటాలోనో కాపురంపెట్టి నానా బీభత్సం చేస్తుందని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. కప్పలు, పాములు తినే చైనా వాళ్ళూ , ఎద్దు మాంసం లేనిదే ముద్దదిగని తూర్పు, పడమర దేశాల వాళ్ళూ , మతం పేర రక్తపుటేర్లు పారించిన వాళ్ళూ కరోనా కోరల్లో నజ్జు అవుతున్నారు. వాటికన్ , మక్కా లాంటి క్షేత్రాలే మనిషి జాడలేకుండా మూతపడి , ఇటలీలాంటి దేశాలు మొత్తానికి మొత్తం దిగ్బంధమై , చైనావాళ్ళు పైకి చెప్పుకోలేని ఘోరకలితో గొల్లుమంటూ ప్రపంచమంతటా హాహాకారాలు దద్దరిల్లుతున్నా , ముంచుకొచ్చిన పీడకు మందు ఏమిటో పాలుపోక ఆధునిక వైద్యశాస్త్రం చేతులెత్తేసిన స్థితిలో పాత పురాణం లో బ్రహ్మ చెప్పిన ఈ విషూచికా మంత్రమే రేపు బాధిత జనాలకు తారకమంత్రం అవుతుందేమో?! ఎవరు చెప్పగలరు ? ఈ సంగతి తెలిస్తే ఏ అమెరికా వాడో ఈ విషూచికా మంత్రానికి అర్జెంటుగా పేటెంటు కొట్టెయ్యడా ?! అయితే, ఈ మంత్రం ద్వారా, 11 రోజుల పాటు జరిగే యాగం -కరోనా వైరస్ బారి నుంచి క్షేమంగా ప్రజలను బయటపడేయటం కోసం ఉద్దేశించిందేనని శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర వివరించారు.