English | Telugu
చివరికి కేసీఆర్ కి ఆ తోక పార్టీనే కావాల్సి వచ్చింది!!
Updated : Sep 30, 2019
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం, ఆయన సతీమణి బరిలో దిగడంతో.. ఎలాగైనా గెలిచి తమ సత్తా చూపాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా.. హుజూర్‌నగర్ లో గెలిచి ఉత్తమ్ కి గట్టి షాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. అందుకే ఉన్న ఏ అవకాశాన్ని టీఆర్ఎస్ వదులుకోవట్లేదు.
హుజూర్‌నగర్ లో తమ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర నాయకత్వానికి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ నాయకులు కె.కేశవరావు, నామా నాగేశ్వర రావు, బోయినపల్లి వినోద్‌కుమార్ ఆదివారం సీపీఐ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితర నేతలతో భేటీ అయ్యి చర్చలు జరిపారు. కాగా, అక్టోబరు ఒకటో తేదీ సీపీఐ కార్యవర్గం సమావేశమై టీఆర్‌ఎస్ వినతిపై నిర్ణయం తీసుకోనుంది.
అయితే టీఆర్ఎస్ హుజూర్‌నగర్ ఉపఎన్నికల కోసం సీపీఐ మద్దతు కోరడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలను తోక పార్టీలు అన్నారు. మరి ఇప్పుడు తోక పార్టీ అయిన సీపీఐ మద్దతు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అందితే తల, అందకపోతే తోక అన్నట్టు.. ఒకప్పుడు మీరు తోక అన్న పార్టీ తోడే ఇప్పుడు మీకు కావాల్సి వచ్చిందా అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.