English | Telugu

అన్న- చెల్లెల్ని నెటిజనులు ఆడేసుకుంటున్నారు!!

ఒక వ్యక్తి గురించి తెలిసి చైనా, అమెరికా వైద్య శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఇక మిగతా దేశాల శాస్త్రవేత్తలైతే.. అసలు మేము శాస్త్రవేత్తలమేనా? అని వారిని వారు ప్రశ్నించుకుంటూ షాక్ లో ఉండిపోయారు. ఇంత గొప్ప శాస్త్రవేత్త, ప్రపంచ దేశాలకి ఎన్నో నేర్పాల్సిన వ్యక్తి.. భారత్ లోని ఓ రాష్ట్రానికి సీఎంగా మిగిలిపోవడం.. ఎందరో మేధావులకు బాధ కలిగిస్తోంది. ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త కావాల్సిన వ్యక్తి.. ప్రజల కోసం కేవలం ఓ రాష్ట్రానికి సీఎంగా మిగిలిపోయాడు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ, ఆయన ఎవరో కాదు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

ఓ దుర్ముహుర్తాన చైనాలో అడుగు పెట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఆరు వేలకు పైగా మరణాలు సంభవించాయి. దీంతో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. పలు అంతర్జాతీయ కార్యక్రమాలు, స్పోర్ట్స్ ఈవెంట్స్ వాయిదా పడ్డాయి. కరోనా దెబ్బకి మన దేశంలో కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. విద్యాసంస్థలకు, షాపింగ్ మాల్స్ కు తలుపులు వేశాయి. ఈ కరోనా ప్రభావం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా పడింది. కరోనా విజృంభిస్తుండటంతో.. కేంద్రం సూచన మేరకు.. ఏపీలో ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు.

ఎన్నికల వాయిదా న్యూస్ వచ్చిందో లేదో.. సీఎం జగన్ ఆవేశంగా ప్రెస్ మీట్ పెట్టారు. కరోనా పేరు చెప్పి కావాలనే ఎన్నికలు వాయిదా వేస్తున్నారు. అసలు కరోనా ప్రమాదం కాదు పాడు కాదు. చిన్న పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పుకొచ్చారు. అంతేనా, బ్లీచింగ్ పౌడర్ తో కరోనాని చంపేయొచ్చు అని సెలవిచ్చారు.

పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్.. ఈ రెండు పదాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్ పై తెగ ట్రోల్ల్స్ వస్తున్నాయి. కరోనాకి మెడిసిన్ పారాసిటమాల్ అని తెలియక ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. మన యువ శాస్త్రవేత్త జగన్ ని ఫాలో అయితే చాలు.. కరోనా ఖతం అవుతుంది అని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. కొందరైతే చైనా, అమెరికా వంటి దేశాల శాత్రవేత్తలు.. జగన్ ని కలవాలని, జగన్ ఆటోగ్రాఫ్ కావాలని అడుగుతున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంకా కొందరైతే మెడికల్ షాపుల్లో బ్లీచింగ్ పౌడర్ దొరకట్లేదు.. ఏం చేయమంటారు సీఎం గారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.
టీవీలలో బిఫోర్- ఆఫ్టర్ యాడ్స్ వస్తుంటాయి కదా. ఆరు నెలల్లో సన్నబడ్డారు, ఆరు నెలల్లో బట్టతలపై జుట్టు వచ్చింది అని.. అలాగే రోజా కూడా బిఫోర్-ఆఫ్టర్ లాంటి ఓ రియల్ కామెడీ స్కిట్ చేసారు. అయితే ఆమె యాడ్స్ లో మాదిరి ఆరునెలలు సమయం తీసుకోలేదు. కేవలం అరగంటలోనే బిఫోర్-ఆఫ్టర్ చూపించారు.

ఎన్నికల వాయిదా అని న్యూస్ రాగానే రోజా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ప్రభావం ఎంత ఉందో మన అందరికి తెలుసు.. కరోనా బారినపడకుండా కాపాడేందుకే ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేశారు అని చెప్పుకొచ్చారు. కరోనా కారణంగానే ఎన్నికల వాయిదా పడ్డాయని టీడీపీ వాళ్ళు తెలుసుకుంటే మంచిదంటూ.. ఓ జబర్దస్త్ సెటైర్ కూడా వేశారు.

కట్ చేస్తే.. సీఎం జగనేమో.. కరోనా లేదు, గిరోనా లేదు.. ఓ హడావుడి చేస్తున్నారు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ మండిపడ్డారు. అది చూసిన రోజా.. అయ్యో జగనన్న ఎంత పని జరిగింది అనుకుంటూ.. కంగారుగా మళ్లీ మీడియా ముందుకి వచ్చి.. బిఫోర్-ఆఫ్టర్ యాడ్ చూపించారు. ఎన్నికల వాయిదా అంతా ఓ పెద్ద డ్రామా, దీని వెనుక చంద్రబాబు ఉన్నాడు అంటూ విరుచుకుపడ్డారు. ఇది చూసిన నెటిజనులు.. అరగంటలో ఎంత మార్పు!!.. పెనం మీద దోస తిప్పినట్టుగా, భలే మాట మార్చారుగా అంటూ ట్రోల్ చేస్తున్నారు.