English | Telugu

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో పలు దేశాల పరిశోధనా బృందాలు దీని నివారణకు వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ప్ర‌యోగాలు చేస్తున్నాయి. సంప్రదాయక టీకాల కన్నా శక్తివంతమైన వ్యాక్సిన్ ను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. అయితే అమెరికా శాస్త్రవేత్తలు అందరికంటే ముందుగా కరోనా వ్యాక్సిన్ ను కనుగొని క్లినికల్ పరీక్షలు ప్రారంభించారు.

కరోనా వైరస్ రోగులు దగ్గు, జలుబు, జ్వరం, నిమోనియాలతో బాధపడుతున్నందున వారికి సోకకుండా ముందుజాగ్రత్తగా వ్యాక్సిన్ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. తేలికపాటి అనారోగ్యంతో బాధపడుతున్నవారు సాధారణంగా రెండు వారాల్లో కోలుకుంటారు, అయితే మరింత తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి మూడు వారాల నుంచి ఆరు వారాల సమయం పట్టవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యనిపుణులు చెపుతున్నారు.

అయితే కరోనా వైరస్ నివారణకు అమెరికా కొత్తగా వ్యాక్సిన్‌ను కనుగొందట‌. అమెరికాలోని సీటెల్ నగరంలోని కైజర్ పర్మినెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల్ని ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల కోసం అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూర్చింది. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు పూర్తి చేసి పూర్తిగా ధ్రువీకరించడానికి ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుందని అమెరికా ప్రజారోగ్యశాఖ అధికారులు చెప్పారు.

కరోనా వ్యాక్సిన్‌ను ఆరోగ్యంగా ఉన్న 45 మంది యువ వాలంటీర్లకు ఇచ్చి పరీక్షించనున్నారు. ఈ కరోనా టీకాల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని అమెరికా శాస్త్రవేత్తలు చెప్పారు.