English | Telugu

కరోనా ఎఫెక్ట్.. శ్రీవారి లడ్డూలు ఉచితం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతాకాదు. భక్తులు స్వామి దర్శనానికి ఎంతగా ఎదురుచూస్తారో.. లడ్డూ ప్రసాదం కోసం కూడా అంతే ఎదురుచూస్తారు. స్వామి దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీ. దీనికి అదనంగా భక్తులు ఇంకా లడ్డూలు కొనుక్కుంటూ ఉంటారు. అంత డిమాండ్ ఉన్న లడ్డూలు.. కరోనా పుణ్యమా అని ఇప్పుడు టీడీపీ ఉద్యోగులకు ఉచితంగా వరించనున్నాయి.

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీటీడీ శ్రీవారి దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే తయారు చేసిన లడ్డూలు పాడవకుండా ఉండటం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక్కొక్కరికి 10 లడ్డూలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దాదాపు రెండు లక్షల లడ్డూలను, ఉగాది కానుకగా ఈనెల 25వ తేదీన.. తిరుపతిలోని ఉద్యోగుల విశ్రాంతి సముదాయం వద్ద ఉద్యోగులకు లడ్డులను పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.