English | Telugu

ప్రపంచం వణికినా..మేం బెదరం..అంటున్న సీఎంలు

కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతున్నా మన పాలకులకు పెద్దగా పట్టించుకోనవసరం లేని విషయంగానే కనిపిస్తోంది.
పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని ఒక ముఖ్యమంత్రి అంటే, మరో ముఖ్యమంత్రి దీనికి వంత పాడుతున్నారు. ఇది నిజం అనుకొని చాలా మంది పారాసిటమాల్ ఇవ్వమని అడుగుతున్నారని ఓ మెడికల్ షాపు మిత్రుడు వాపోయాడు. వీళ్ళ మాటలవల్ల పారాసిటమాల్ కొరత ఏర్పడి అది నిజంగా అవసరమైన బాధితులు ఇబ్బందిపడే దుస్థితి ఏర్పడ్డా ఆశ్చర్యం లేదు. కరోనాకు ఇప్పటి వరకూ వాక్సిన్, మందులు అందుబాటులోకి రాలేదు.. ఈ విషయం సంబంధిత అధికారులు ఈ ఇద్దరూ సీఎంలకు అర్థమయ్యేలా చెబితే బాగుంటుంది.

ఒక ముఖ్యమంత్రి ఆందోళన అవసరం లేదు అంటూనే విద్యాసంస్థలు, థియేటర్ల, బార్లు, పబ్లు మూసివేతకు ఆ దేశాలు ఇచ్చేసి, రూ.500 కోట్లు కేటాయించారు. సంతోషం కానీ అవి క్షేత్ర స్థాయిలో ఎలా వినియోగిస్తున్నారు అనే అవగాహన ఎవరికీ లేదు. మరో ముఖ్యమంత్రికి కరోనా కన్నా మున్సిఫల్ ఎన్నికలే ముద్దు.. కరోనాపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రధానాధికారి తీసుకున్న నిర్ణయంపై అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు..

కరోనా వ్యాప్తి భయంతో ప్రజలు మాస్కులు కొందామని మెడికల్ షాపులకు వెళ్లితే అక్కడ అవి దొరకడం లేదు. ఉన్నా రెండు మూడింతల రేట్లు పెంచి అమ్ముకుంటున్నారు. సానిటైజర్ లిక్విడ్ ధర కూడా అందనంత దూరంలో ఉంది. మాస్కులు, సానిటైజర్ల ఉత్పత్తిని పెంచి, ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఇంగితం మన నాయకుల్లో లోపించింది. మన దగ్గర ఉష్ణోగ్రత అధికమని, కరోనా మనకు అంత ప్రమాదం కాదనే భ్రమలు వద్దు.. ఇలాంటి ఊహాగానాలతో పొద్దు పుచ్చడానికి ఇది సరైన సమయం కూడా కాదు. తక్షణం ప్రజలకు కనీస జాగ్రత్తలకు అవసరమైన ఉపకరణాలను అందుబాటులోకి తేవడం పాలకుల విధి..