English | Telugu

ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు... ఇప్పుడు చరిత్రలో కలిసిబోతోంది...

తెలంగాణ రాష్ట్ర పరిపాలన కేంద్రం మూగబోయింది. ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన సెక్రటేరియట్‌కు తాళం పడింది. హైదరాబాద్ స్టేట్ మొదలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వరకు... అలాగే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి సేవలందించిన సెక్రటేరియట్‌ ఇకపై చరిత్ర కానుంది. ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలన సాగించిన చారిత్రక సచివాలయానికి మూతపడింది.

హైదరాబాద్‌ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఇక్కడ మొదలైన పాలన, ఆ తర్వాత 1956లో కోస్తాంధ్ర, రాయలసీమలను విలీనం చేస్తూ ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహరావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామ్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నందమూరి తారకరామారావు, నాదెండ్ల భాస్కరరావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కోణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు... ఇక్కడ్నుంచే పరిపాలన కొనసాగించారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్... ప్రారంభంలో కొద్దిరోజులు ఈ సచివాలయం నుంచి పరిపాలన సాగించినా, వాస్తు బాగోలేదంటూ, క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ నుంచే అధికార కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు. ప్రభుత్వ శాఖలన్నీ ఇక్కడే ఉన్నా, కేసీఆర్ సమీక్షలన్నీ ప్రగతి భవన్‌ నుంచే సాగాయి. అయితే, మంత్రులు మాత్రం సెక్రటేరియట్ నుంచే అధికారిక వ్యవహారాలు కొనసాగించారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడున్న ప్రాంతంలోనే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించడంతో సచివాలయాన్ని ఖాళీచేసి మూసివేశారు.

ఇక, సుమారు 4వందల కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాలతో కొత్త సెక్రటేరియట్‌ నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతమున్న భవనాలను కూల్చివేసి, ఇప్పుడున్న ప్లేస్‌లో కొత్త సెక్రటేరియట్‌‌ను నిర్మించనున్నారు. అత్యాధునిక హంగులతో, సకల సౌకర్యాలతో, చరిత్రలో నిలిచిపోయేలా, అన్ని శాఖలు ఒకేచోట ఉండేలా, పక్కా వాస్తుతో దాదాపు 6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన సచివాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.