English | Telugu
గాంధీభవన్లో రేవంత్ వివాదం.. రెండ్రోజులుగా అనుచరుల నిరసన...
Updated : Mar 9, 2020
తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యనేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పైకి కనిపించకపోయినా, ఎవరికివారు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు ఒకరినొకరు కార్నర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా రేవంత్ ను పలువురు సీనియర్లు టార్గెట్ చేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ తో అది మరోసారి రుజువైంది. నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించుకున్నారంటూ డ్రోన్ కెమెరాలతో రేవంత్ చేసిన హల్ చల్ కు టీకాంగ్రెస్ నేతల నుంచి మద్దతు లభించలేదు. దాంతో, రేవంత్ వర్గీయులు గాంధీభవన్లో ఆందోళన చేపట్టారు.
రేవంత్ రెడ్డి వర్గీయులు రెండ్రోజులుగా గాంధీభవన్లో నిరసన తెలియజేస్తున్నారు. రేవంత్ ను అరెస్ట్ చేస్తే... పీసీసీ చీఫ్ ఉత్తమ్ గానీ, ఇతర ముఖ్య నేతలెవరూ స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ పై పోరాడుతుంటే, కనీసం మద్దతు ఇవ్వడం లేదని, అన్యాయంగా అరెస్ట్ చేసినా, నేతలెవరూ స్పందించకపోవడం అన్యాయమని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కేటీఆర్ ఫాంహౌస్ ను వెలుగులోకి తెచ్చి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డిని అభినందించాల్సిన నేతలు... కనీసం నోరు విప్పకపోవడంపై మండిపడుతున్నారు.
అయితే, పీసీసీ చీఫ్ ను గానీ, పార్టీని కానీ సంప్రదించకుండా వ్యక్తిగతంగా రేవంత్ చేస్తున్న ఆందోళనలను టీకాంగ్ ముఖ్యనేతలు తప్పుబడుతున్నారు. రేవంత్ రెడ్డి తీరుపై అధిష్టానం కూడా గుర్రుగా ఉందని అంటున్నారు. రేవంత్ తాజా వివాదం పంచాయతీ కూడా హైకమాండ్ దగ్గర ఉందంటున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారని, రేవంత్ వ్యవహారాన్ని అధిష్టానంతో చర్చించే అవకాశముందని అంటున్నారు. మొత్తానికి రేవంత్ వ్యవహరశైలి... టీకాంగ్రెస్ లో మరోసారి వివాదాస్పదమైంది.