English | Telugu
డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు
Updated : Mar 18, 2020
ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ రెడ్డి తరుఫున ఏఐసీసీ నుండి వచ్చిన సుప్రీం కోర్టు సీనీయర్ లాయర్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. డ్రోన్ కేసులో అరెస్ట్ అయి గత 14 రోజులుగా రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులోనే ఉన్నారు. తొలుత బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కూకట్‌పల్లి కోర్టు కొట్టివేసింది. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన అభియోగాలు, ఎఫ్‌ఐఆర్, కేసును పూర్తిగా కొట్టివేయాలనే పిటిషన్‌లతో పాటు బెయిల్ పిటిషన్లను దాఖలు చేయగా. బెయిల్ ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
రూ.10 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని కూడా ఆదేశించారు. అయితే, తనపై నమోదైన ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలన్న మరో పిటిషన్‌ను మాత్రం కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
కేటీఆర్ ఫాంహౌజ్‌పైన డ్రోన్ ఎగరేసి చిత్రీకరించిన ఆరోపణలపై ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్లు ఎగరేసి కెమెరాతో చిత్రీకరించడం నేరమని రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. జీవో నెం. 111ను ఉల్లంఘించి మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని నిరూపించేందుకు తాను డ్రోన్ ఎగరేసినట్లు చెప్పారు. అయితే, రేవంత్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపింస్తున్నారు. గోపన్ పల్లి వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఇరుక్కున్నందుకు, ప్రతిచర్యగా ఆయన జీవో 111 అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శిస్తున్నారు.