English | Telugu
ఎస్ బ్యాంక్ వ్యవహారం నుంచి బయటపడ్డ తిరుపతి బాలాజీ.. పూరీ జగన్నాధుడికి మాత్రం చుక్కలు...
Updated : Mar 10, 2020
ఎస్ బ్యాంక్ వ్యవహారం పై సోషల్ మీడియా మండిపడిపోతోంది. సత్యం కంప్యూటర్స్ అనే ప్రయివేట్ కంపెనీ సంక్షోభ సమయంలో టెక్ మహీంద్రా అనే ప్రైవేటు సంస్థ ద్వారా అప్పట్లో నష్ట నివారణచర్యలు చేపట్టిన విషయాన్నీ గుర్తు చేస్తున్న నెటిజన్లు, ఇప్పుడు ఎస్ బ్యాంక్ అనే ప్రయివేట్ బ్యాంక్ తాలూకు ఉద్యోగుల సంక్షేమం, వినియోగదారుల సంక్షేమం కోసం కార్పొరేట్ బ్యాంక్ లైన -ఐ సి ఐ సి ఐ, యాక్సిస్, హెచ్ డి ఎఫ్ సి ల సాయం కోరకుండా, ప్రభుత్వం ఇప్పుడు -స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ ఐ సి లాంటి జాతీయ సంస్థల ను రంగం లోకి ఎందుకు దింపుతోందనేది నెటిజన్ల ప్రశ్న. " ఓ పక్కనేమ్మో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం చెయ్యాలి అంటారు, ఇంకో పక్కన ప్రైవేట్ సంస్థలు మ్యూనిగిపోతుంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కలపాలి అంటారు. మీరు ఏమాట్లాడుతున్నారో మేకైనా అర్ధమౌతోందా?," అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఇప్పటికే- పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్‌ను మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయటం, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలో అక్రమ నగదు చలామణికి పాల్పడినట్టు పీఎంఎల్ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేయటం జరిగిపోయాయి. డీహెచ్ఎఫ్ఎల్ సహా మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చిన రుణాల విషయంలో కపూర్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. యెస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోవడానికి దారితీసిన మరికొన్ని అవకతవకల్లోనూ ఆయన పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెల పేరుతో నకిలీ కంపెనీ ప్రారంభించిన రూ.600 కోట్లు డీహెచ్ఎఫ్ఎల్ నుంచి తరిలించినట్టు గుర్తించారు. యెస్ బ్యాంకు మొత్తం రూ.4,450 కోట్ల రుణం మంజూరు చేయగా ఇందులో డీహెచ్ఎఫ్ఎల్కి రూ.3,700 కోట్లు, ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్‌కి రూ.750 కోట్లు బదిలీచేశారు. అయితే, రుణాల సకాలంలో చెల్లించకపోయినా యెస్ బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 79 షెల్ కంపెనీలు ఏర్పాటుచేసి మొత్తం రూ.13,000 కోట్లను మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ 4,450 కోట్లు కూడా అందులో భాగంగానే తరలించినట్టు భావిస్తోంది. ఇంత పకడ్బందీ గా వ్యహారం నడిపిన ఎస్ బ్యాంక్ యాజమాన్యం ఈ రోజు లక్షలాది మంది డిపాజిటర్లను, ప్రభుత్వ, ప్రవేట్ సంస్థలను రోడ్డు మీదకు ఈడుస్తుంటే, ఆ సంస్థకు జాతీయ బ్యాంకుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయటం దేనికిసంకేతమనేది నెటిజన్ల ప్రశ్న. తిరుపతి వెంకన్న సొమ్ము ను ముందస్తుగా టీ టీ డీ ఎలాగో విత్ డ్రా చేయగలిగింది కానీ, పూరీ జగన్నాధుడికి మాత్రం ఎస్ బ్యాంక్ సున్నమేసింది. పూరీ ఆలయ అధికారులు ఇప్పుడు తమకు రావాల్సిన 547 కోట్ల రూపాయలు ఎలారాబట్టుకోవాలో అర్ధం కాని పరిస్థితి.... మరో వైపు ఏ పీ ఎస్ ఆర్ టీ సి కూడా ఒక రెండు వందల కోట్ల రూపాయలకు పైబడి ఎస్ బ్యాంక్ నుంచి సొమ్ము రాబట్టుకోవలసి ఉంది.