English | Telugu

కరణం తనయుడు, డొక్కా కుమార్తెలకు జెడ్ పీ పీఠాలు...

సభ్య సమాజానికి క్లియర్ మెసేజ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి


మ్యాచ్ ఫిక్స్ అయిపొయింది... ఇంకా ప్రమాణ స్వీకారాలె తరువాయి.. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా కరణం బలరామ కృష్ణ మూర్తి తనయుడు కరణం వెంకటేష్, అలాగే పక్కనే ఉన్న గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా డొక్కా మాణిక్య వర ప్రసాద్ కుమార్తె ల పేర్లు దాదాపుగా ఖరారు అయిపోయాయి. అంటే, ఇదంతా క్విడ్ ప్రో కో నేనా అని ఎవరికైనా సందేహాలు కలిగితే, అలాంటి వాటికి జవాబులు ఉండవు. పార్టీ విధానాలు నచ్చి వెళ్లిన కరణం కుటుంబం, అలాగే డొక్కా కుటుంబాల తక్షణ రాజకీయ అవసరాలు తీర్చే కల్పతరువుగా వై ఎస్ ఆర్ సి పి అధినేత జగన్ మోహన్ రెడ్డి వారికి కనిపించి ఉండవచ్చు. అంచేత, ఇందులో మనం కరణం, డొక్కా ఫ్యామిలీ ల రాజకీయ అవసరాలు, ప్రాధమ్యాల గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తే, వారు హర్ట్ అవ్వొచ్చు. అంచేత, అందరూ కూడా ఈ ఎపిసోడ్ ను కేవలం ఒక పాజిటివ్ దృక్పథం తోనే చదవాలనేది , చూడాలనేది ఆ రెండు రాజకీయ కుటుంబాల ఆకాంక్ష. అయితే, ఈ విషయం లో డొక్కా మాణిక్ వర ప్రసాద్ అభిప్రాయం మాత్రం మరోలా ఉంది.

ఆయన కుమార్తె సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న కారణంగా ప్రస్తుతానికైతే అటువంటి ఉద్దేశం లేదని, ఒక వేళ పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటే మాత్రం తప్పని సరిగా తన కుమార్తె బరి లో నిలబడుతుందని ఆయన తన సన్నిహితుల దగ్గర చెపుతూ వస్తున్నారు. బీ టెక్ తో పాటు, తండ్రి మాదిరే న్యాయ శాస్త్రం అభ్యసించిన -డొక్కా మాణిక్ వర ప్రసాద్ కుమార్తె ఒక వేళ బరిలో నిలబడితే, నిజం గా డొక్కా ఫ్యామిలీకి పునరావాసం దొరికినట్టే. తెలుగుదేశం పార్టీ లో ఉన్నప్పుడు కూడా -డొక్కా సాత్వికంగా నే వ్యవహరించేవారు. అదే సామాజిక వర్గానికి చెందిన వార్ల రామయ్య ప్రదర్శించే దూకుడు -డొక్కా ఎప్పుడూ ప్రదర్శించ లేదు.

ఈ విషయాలు పక్కన పెడితే, విలువల తో కూడిన రాజకీయాలు చేస్తామని నినదిస్తూ కొత్త తరం ఓటర్లను ఆకట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఫార్ములా నే అనుసరిస్తూ రావటం అందరినీ విస్మయపరుస్తోంది. అప్పట్లో వై ఎస్ ఆర్ సి పి కి చెందిన ఎం ఎల్ ఏ లు, వారి కుటుంబ సభ్యులను టోకున తెలుగు దేశం లోకి తరలించిన చంద్రబాబు వైఖరినే, జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అవలంబిస్తున్నారు. అటువంటి చర్యల కారణం గా చంద్రబాబు తర్వాతి రోజుల్లో ఏ రకంగా నష్ట పోయారో..ఇటీవలి వరుస వలసలు చుస్తే మనకి విషయం ఇట్టే బోధపడుతుంది. కడప జిల్లా ఖాళీ అయిపోయి దిగాలుగా ఉన్న తెలుగుదేశం పరిస్థితి, రాబోయే రోజుల్లో వై ఎస్ ఆర్ సి పి కి వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ‘మేం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఎవరైనా సరే వైసీపీలోకి రావాలంటే ఖచ్చితంగా పార్టీకి, పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే. ’ ఇదీ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చేసిన ప్రకటన. అప్పట్లో జగన్ ప్రకటనను చూసిన వారంతా శభాష్ అన్నారు. కానీ ఆ ప్రకటన చేసిన కొద్ది రోజులకే రాజకీయం మారిపోయింది.

గురువారం నాడు తాడేపల్లిలో కరణం బలరామ్ దగ్గర ఉండి తన కొడుకు కరణం వెంకటేష్ ను వైసీపీలో చేర్చారు. ఆయన కూడా ఎక్కడా మొహమాటపడకుండా తాను ఎందుకు వైసీపీకి దగ్గర అవుతున్నదీ మీడియా సాక్షిగా చెప్పారు. అందరూ చెప్పినట్లే చీరాల అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇంకా విచిత్రం ఏమిటంటే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ అడుగు ముందుకు వేసి టీడీపీలో కరణం బలరామ్ కు అన్యాయం జరిగిందని..కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇఛ్చి కరణం లాంటి వాళ్ళను పక్కన పెట్టారని వాపోయారు. అధికారికంగా కరణం బాలరామ్ కు కండువా కప్పితే ఎమ్మెల్యే పదవి పోతుందనే కారణంగానే ‘ఈ విలువలతో కూడిన రాజకీయ మార్గాన్ని’ ఎంచుకున్నట్లు కన్పిస్తోందనే విషయం స్పష్టం అవుతోంది.

వైసీపీ నేతలు జగన్ కండువా కప్పలేదు కాబట్టి కరణం బలరామ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వాదించవచ్చు. ఓకే. కానీ కళ్ల ముందు ఏమి జరుగుతుందో అందరూ చూస్తున్నారు. అదే చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా వైసీపీ ఎమ్మెల్యేకు నేరుగా పసుపు కండువాలు కప్పే పార్టీలో చేర్చుకున్నారు. ఇలా ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఫిర్యాదులు చేస్తే స్పీకర్ తో వాటిని సంవత్సరాల తరబడి పక్కన పెట్టించారు. ఈ ఫిరాయింపులతో చంద్రబాబు ఎంత అప్రతిష్ట తెచ్చుకున్నదీ అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ఫార్ములా ని యాజ్ ఇటీజ్ గా అమలు చేస్తే, సభ్య సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్టు అనుకోవాలి.