English | Telugu
ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో మరో అరెస్ట్... ఆడియో టేపులపై దర్యాప్తు
Updated : Oct 1, 2019
ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో మరొకర్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏడుగురిని రిమాండ్ కి పంపిన ఏసీబీ... తాజాగా ఈఎస్‌ఐ సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్‌బాబును జైలుకు పంపింది. ఈఎస్‌ఐ డైరెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సురేంద్రనాథ్‌బాబు... డైరెక్టర్ దేవికారాణి చెప్పినట్లు మొత్తం కథ నడిపించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించకుండానే తప్పుడు బిల్లులతో కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తేల్చారు. ఆర్సీపురం బ్రాంచ్‌లో ఉద్యోగిగా ఉన్న సురేంద్రనాథ్... అనధికారికంగా డైరెక్టర్ కార్యాలయంలో పనిచేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే, నకిలీ బిల్లులు సృష్టించాలని ఈఎస్‌ఐ డాక్టర్స్‌ను సురేంద్రనాథ్‌బాబు బెదిరించినట్లు తేల్చిన ఏసీబీ అధికారులు... ఆడియో టేపులపైనా దర్యాప్తు జరుపుతున్నారు.
ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి డిస్పెన్సరీ కేంద్రంగా జరిగిన కుంభకోణంలో రెండు వందల కోట్లపైనే అవినీతి జరిగినట్లు గుర్తించారు. డైరెక్టర్ స్థాయి నుంచి సెక్షన్ ఆఫీసర్ వరకు ముడుపులు అందినట్లు ఆధారాలతో సహా సేకరించారు. 2015లో దేవికారాణి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ఈ స్కామ్ మొదలైనట్లు గుర్తించారు. ఇక, ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణిని అడ్డంపెట్టుకుని ఫార్మాసిస్టులు అందినకాడికి దోచుకున్నట్లు రికార్డుల్లో తేలింది.