English | Telugu

మ‌తం మారినా ఎస్సీ హోదా అనుభ‌విస్తారా?

వైఎస్ఆర్సీపీ తరఫున బాపట్ల ఎంపీగా గెలుపొందిన నందిగాం సురేశ్ పై హిందూ ధార్మిక సంస్థ‌లు, ద‌ళిత వాద సంఘాలు మండిప‌డుతున్నాయి. ఎ.సి. రిజ‌ర్వేష‌న్ కోటాలో గెలిచి క్రిస్టియానిటీని స్వీక‌రించ‌డం ఎస్సీ స్టేట‌స్‌ను దుర్వినియోగం చేయ‌డ‌మేన‌ని వారు రాష్ట్ర‌ప‌తికి, లోక్ స‌భ స్వీక‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేవ‌లం ఎం.పి. నందిగాం సురేష్‌యే కాదు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కోటా కింద ఆయా ప్ర‌త్యేక నియోజ‌క వ‌ర్గాల నుంచి గెలిచిన చాలా మంది నేత‌లు క్రిస్టియానిటీ తీసుకున్నార‌ట‌. అంతే కాదు బైబిల్ చేతిలో ప‌ట్టుకొని ద‌ర్జాగా చ‌ర్చికి వెళ్ళి ప్రార్థ‌న‌లు చేస్తూ ముఖ్య‌మంత్రి దృష్టిలో ప‌డ‌డానికి ఫోటో ఫోజులు కూడా ఇస్తున్నార‌ట‌.

ఏపీలో జరుగుతున్న ఈ రాజ‌కీయ పరిణామాలు, హిందూ దేవాలయాలపై, సంస్కృతిపై జరుగుతున్న దాడిగానే అర్థం చేసుకోవాల‌ని హిందూ మ‌త పెద్ద‌ల‌తో పాటు బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తితో పాటు లోక్‌స‌భ స్వీక‌ర్ దృష్టికి ఈ వ్య‌వ‌హారాన్ని తీసుకెళ్ళారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రోత్సాహంతోనే ప్రభుత్వ అండదండలతో ఇదంతా జ‌రుగుతోందంటున్నారు.

కేవ‌లం ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం కోసం ప్ర‌త్యేక నియోజ‌క‌వ‌ర్గాల్ని అడ్డం పెట్టుకొని గెలుస్తున్నారు. వాస్త‌వానికి త‌మ మ‌న‌సాక్షిగా త‌మ‌కు న‌చ్చిన మ‌తాన్ని పాటిస్తున్నారా అంటే ఆ దేవుడికే తెలియాలి. త‌మ నేత‌ల‌ను సంతోష‌పెట్ట‌డానికే ఇక్క‌డ కూడా రాజ‌కీయాలు చేయ‌డం మ‌న నేత‌ల‌కు అల‌వాటైపోయింది. రిజ‌ర్వేష‌న్ క్యాటిరిగిలో వున్న ప్ర‌త్యేక నియోజ‌క‌వ‌ర్గాల నుంచి గెలిచి మ‌న‌సాక్షిగా రాజ్యంగ‌బ‌ధంగా ప్ర‌మాణం చేసి మ‌ళ్ళీ అదే మ‌న‌సాక్షిగా వేరే మ‌తం అవ‌లంభించ‌డం ఏమిట‌ని హిందూ ధార్మిక సంస్థ‌లు దుమ్మెత్తిపోస్తున్నాయి.

మాత‌మార్పిడిల‌పై ఇక ఊపేక్షించేది లేద‌ని, క‌ఠినంగా కొర‌ఢా ఝ‌ళిపించ‌డానికే మోదీ ప్ర‌భుత్వం యాక్ష‌న్‌లోకి దిగింది. అందులో భాగంగా ప్ర‌జాప్ర‌తినిధుల్ని ల‌క్ష్యంగా చేసుకొంది. ఇప్ప‌ట్టికే ఆర్ఎ.స్ఎ.స్‌. దేశ‌వ్యాప్తంగా మ‌తం మార్చుకున్న వారి జాబితా త‌యారుచేసి ప్ర‌భుత్వానికి ఇచ్చింది.

అయితే మ‌త‌మార్పిడిల‌కు పాల్ప‌డుతున్న వారి ఆట‌లు క‌ట్టించ‌డానికి మోదీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. బాప‌ట్ల ఎంపి వ్య‌వ‌హారంలో ద‌ళిత సంఘాల్నే రంగంలోకి దింపింది. ప్ర‌జాప్ర‌తినిధుల్ని ల‌క్ష్యంగా చేసుకుంటే దీనిపై చ‌ర్చ ఎక్కువ‌గా జ‌రిగి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ‌తార‌ని ఆర్ ఎస్ ఎస్ భావిస్తోంది. ఆర్ ఎస్ ఎస్ డైరెక్ష‌న్‌లో బిజెపి ప్ర‌భుత్వం ఆదిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టింది. హిందు మ‌తం నుంచి వేరే మ‌తంలోకి మారిన వారు మ‌ళ్ళీ హిందూమ‌తాన్ని అడ్డంగా పెట్టుకొని లాభ‌ప‌డాల‌ని చూస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌నే సందేశం పంపేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది.