English | Telugu
ఐఏఎస్ సిద్దార్థ్ జైన్, చంద్రబాబు కి తాబేదారు: పెద్దిరెడ్డి
Updated : Mar 18, 2020
సమరమే..ఇక సమరమే అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కదన రంగం లోకి దూకారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఫైర్ అయితే, మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి, సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి సిద్దార్థ జైన్ మీద నిప్పులు చెరిగారు. సిద్దార్థ్ జైన్ ను నాయుడు తాబేదారు గా ఆయన అభివర్ణించారు. " ఎన్నికల వాయిదా వెనుక చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల కుట్ర వుంది. చంద్రబాబు, రమేష్ కుమార్ లు ఎస్వీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. అనేక సందర్బాల్లో రమేష్ కుమార్ కు చంద్రబాబు సాయం చేశాడు. నిబద్దత గల ఐఎఎస్ అధికారి బాబూరావు చిత్తూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడుగా వుంటే....ఆయనను మార్చి... చంద్రబాబుకు తాబేదార్ అయిన సిద్దార్ధాజైన్ ను రమేష్ కుమార్ నియమించాడు," అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పాత లెక్కలు కూడా కలిపి మరీ చెప్పుకొచ్చారు.
"చంద్రబాబుకు నీడలాంటి ఐఎఎస్ అధికారి సిద్దార్ధజైన్ ని ఇక్కడ నియమించడంలో కుట్ర వుంది. చంద్రబాబు ఏం చెబుతాడో అదే రాయడానికి సిద్దార్థాజైన్ ను నియమించారు. నిబద్దతగా పనిచేసే పోలీసులు, అధికారులపై సిద్దార్థాజైన్ వ్యతిరేక నివేదికలు రాస్తాడు. ఆ నివేదికల ఆధారంగా రమేష్ కుమార్ చర్యలు తీసుకుంటున్నాడు. చంద్రబాబు కోసం ఎస్ ఈసి రమేష్ కుమార్ ఎంత ప్రాకులాడుతున్నాడో అర్థమవుతోంది. గతంలో తన జెసిగా వున్న భరత్ నారాయణ గుప్తాను సిద్దార్థా జైన్ వేధించాడు. తన దగ్గర పనిచేసే వారిని ఒరేయ్ అని పిలిచే అధికారి సిద్దార్థాజైన్. చంద్రబాబు ఏం చెబితే అది చేసే అధికారి సిద్ధార్థాజైన్. ఇలాంటి వ్యక్తిని చిత్తూరు జిల్లా పరిశీలకుడుగా నియమించడంలోనే కుట్ర వుంది," అంటూ పెద్దిరెడ్డి విరుచుకు పడ్డారు. " తిరుపతిలో ఎస్సీని ట్రాన్స్ ఫర్ చేశారు...ఆయన కింద వున్న వారు బాగా పనిచేశారని అన్నారు. చిత్తూరులో కిందిస్థాయి పోలీసులను ట్రాన్స్ ఫర్ చేస్తారు.. అక్కడి ఎస్పీ బాగా పనిచేశారని చెబుతున్నారు. సిద్దార్థాజైన్ కు బుద్ది వుంటే... ఇలాంటి రాతలు రాసి ఎన్నికల కమిషన్ కు ఇస్తాడా? ఎన్నికల కమిషన్ కు బుద్ది వుంటే.. ఈ రాతల్లోని నిజానిజాలు తెలుసుకోవద్దా," అంటూ కూడా మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.