English | Telugu

ఓ వైపు కరోనా వణుకుపుట్టిస్తుంటే.. ఆ మంత్రికి ఎన్నికలు కావాలట!!

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తూ.. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ అధికార పార్టీ ఎన్నికల వాయిదాను తప్పుబట్టింది. సీఎం వైస్ జగన్ మొదలుకొని మంత్రులు, ఇతర నేతలు ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సీఎం కూడా రమేష్ కుమార్ పై ఇవే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు.. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనాకు కళ్లెం వేయొచ్చని చెప్పుకొచ్చారు.

కానీ కరోనా సీఎం చెప్పినంత తేలికగా లేదు. కరోనాకి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అయినా జగన్ సర్కార్ మాత్రం అబ్బే అంత ప్రమాదం లేదు.. ఎన్నికలు జరిపించాలంటూ.. సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీం కూడా ఎన్నికల వాయిదాను సమర్థిస్తూ జగన్ సర్కార్ కి షాకిచ్చింది. తర్వాతర్వాత కరోనా మరింత విజృంభిస్తుండటంతో.. దాని ప్రభావం ఏపీ సర్కార్ కి కూడా తెలిసొచ్చినట్టుంది. చాలా రోజుల తరువాత ఆరోగ్యమంత్రి మీడియా ముందుకి వచ్చారు. సీఎం కూడా అధికారులతో సమీక్షలు జరుపుతూ.. కరోనాని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఉగాదికి చేయాలనుకున్న పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మొత్తానికి ఏపీ సర్కార్ కి కరోనా ప్రభావం తెలిసొచ్చింది, చర్యలు తీసుకుంటుంది అనుకుంటుంటే.. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యలు మాత్రం విమర్శలకు దారితీస్తున్నాయి.

స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం అప్రజాస్వామ్యం అని మంత్రి బుగ్గన అన్నారు. ఎన్నికల వాయిదాపై ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదించిందా? రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్య శాఖను సంప్రదించిందా? రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో ఉందో ఈసీకి తెలుసా? అని బుగ్గన ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు అధికారపక్షం వైపే ఉంటారని బుగ్గన చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ఒకవైపు ప్రజలు కరోనా భయంతో బిక్కుబిక్కు మంటుంటే.. మంత్రి గారికి ఎన్నికలు కావాల్సి వచ్చాయా అని ప్రజలు మండిపడుతున్నారు. కరోనాపై ప్రజలకు అహగాహన కలిగించాల్సిన స్థాయిలో ఉన్న మంత్రి బుగ్గన.. ఇలా ఎన్నికల కోసం తాపత్రయ పడటం ఏంటని విమర్శిస్తున్నారు.