English | Telugu

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ.. ఇంతకీ అందులో ఏముందంటే?

మాగంటి కుటుంబ కలహం ఇప్పుడు అంటే జూబ్లీ ఉప ఎన్నిక ముంగిట బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసలు ఇంత వరకూ అంటే జూబ్లీ ఉప ఎన్నికలో మాగంటి సునీతను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించే వరకూ.. అసలంతదాకా ఎందుకు మాగంటి గోపీనాథ్ బతికి ఉన్న కాలంలో ఎన్నడూ మాగంటి మొదటి భార్య అన్న ప్రస్తావనే రాలేదు. అసలు మాగంటి సునీత ఆయనకు రెండో భార్య అన్న విషయమే దాదాపుగా ఎవరికీ తెలియదు. కానీ మాగంటి మరణం తరువాత.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూబ్లీ ఉప ఎణ్నిక ముంగిట మాగంటి కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. మాగంటి గోపానాథ్ సిసలైన వారసుడిని తానేనంటూ ప్రద్యుమ్నతారక్ మీడియా ముందుకు వచ్చారు. అంతే కాదు.. ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు. మాగంటి గోపానాథ్ భార్యను అంటూ సునీత అఫిడవిట్ లో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారనీ, ఆమె నామినేషన్ రద్దు చేయాలనీ కోరారు.

సరే ఎన్నికల సంఘం మాగంటి సునీత నానినేషన్ సరిగానే ఉందని పేర్కొంది. ఇప్పుడు తాజాగా మాగంటి తల్లి కూడా మీడియా ముందుకు వచ్చి మాగంటి సునీతపై విమర్శలు గుప్పించారు. తన కుమారుడు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న సమయంలో కూడా తనను దూరం పెట్టారనీ, కన్నకొడుకుని కడసారి చూసుకునే భాగ్యం కూడా దక్కకుండా చేశారని ఆరోపించారు. అంతే కాదు.. తన కుమారుడి మరణమే ఓ మిస్టరీ అంటూ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో బీఆర్ఎస్ ఒకింత ఇబ్బందుల్లో పడింది.

ఆ తరువాత మాగంటి సునీత రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ మరింత సంచలనం సృష్టిస్తోంది. మాగంటి ఆస్పత్రిలో ఉన్న సమయంలో సునీత ఆస్పత్రి సెక్యూరిటీకి రాసినట్లుగా ఉన్న ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ లేఖలో మాగంటి తల్లి, సోదరుడు సహా కుటుంబ సభ్యులెవరినీ మాగంటి గోపీనాథ్ ను చూసేందుకు ఆస్పత్రిలోకి అనుమతించవద్దంటూ మాగంటి సునీత రాసినట్టుగా ఉన్న లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో బీఆర్ఎస్ లో ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద మాగంటి కుటుంబ వివాదం ప్రభావం జూబ్లీ బైపోల్ పై ఏ మేరకు పడుతుందన్నది వేచి చూడాల్సిందే.