English | Telugu

ఏపీలోని ప్రైవేట్‌ల్యాబ్‌ల్లో క‌రోనా టెస్ట్‌కు అనుమ‌తిలేదు!

NABL గుర్తింపు పొందిన డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ల జాబితాలో ఎపికి స్థానం ద‌క్క లేదు. CMR మార్గదర్శకాల ప్రకారం క‌రోనా పరీక్షలను నిర్వహించే సామర్థ్యం ఉన్న NABL గుర్తింపు పొందిన డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ల జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఒక్క ల్యాబ్ కు కూడా చోటు ద‌క్క‌లేదు. అయితే తెలంగాణాలో ఐదు ప్రైవేట్ ల్యాబ్‌ల‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి ఎన్.ఎ.బి.ఎల్. అనుమ‌తిచ్చింది. ఉన్న‌త‌స్థాయి ప్ర‌మాణాలున్న ల్యాబ్‌ల‌కే ఎన్.ఎ.బి.ఎల్‌. గుర్తింపు ఇస్తుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న క‌రోనా టెస్ట్ ల్యాబ్‌ల వివ‌రాలు ఇలా వున్నాయి. 1. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి. 2. ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం, 3. జిఎంసి, అనంతపురం. 4. విజ‌య‌వాడ సిద్ధార్థ కాలేజ్ ఈ నాలుగు చోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక్క‌డ శాంపిల్‌ను పరీక్షించిన అనంతరం వచ్చిన ఫలితాలను నిర్ధారించేందుకు పూణేలోని నేషనల్‌ వైరాలజీ లేబొరేటరీకి పంపించేవారు. అక్కడ నుంచి రిపోర్టులు రావడానికి మూడు రోజుల సమయం ప‌ట్టేది.

ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల వైరాలజీ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను నిర్ధారించే రియల్‌ టైం పాలీమిరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్టీపీసీఆర్‌) పరికరం ఏర్పాటు చేసింది. కొత్త‌గా ఏర్పాటు చేసిన‌ విజయవాడ ల్యాబ్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కరోనా అనుమానితుల శాంపిళ్లను ఇక్కడకు ప‌రీక్షిస్తున్నారు. ఇక్కడి ఫలితాలు, పూణే ఫలితాలు సరిగా ఉన్నట్లు తేల‌డం వ‌ల్ల పూణే ల్యాబ్‌కు పంపించాల్సిన అవసరం లేకుండానే విజయవాడ ల్యాబ్‌లోనే పరీక్షలు నిర్వహించి కేవ‌లం ఆరు గంటల్లోనే రిపోర్టు ఇవ్వగలుగుతున్నారు. తద్వారా రోగికి అవసరమైన చికిత్స సత్వరమే అందడానికి వీలవుతుంది.

కరోనా సోకిన వ్యక్తికి రోజుల్లోనే ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఎంత త్వరగా కనుగొంటే అంత రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే టెస్టులు పూర్తి చేసేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం విజ‌య‌వాడ‌లో వైరాలజీ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో అయితే కేవ‌లం గాంధీ మెడికల్ కాలేజ్‌లోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే 5 ప్రైవేట్ ల్యాబ్‌ల‌లో కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవ‌డానికి అక్క‌డి ల్యాబ్‌ల‌కు అనుమ‌తి ల‌భించింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌రైన ప్ర‌మాణాలు లేక‌పోవ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రైవేట్ ల్యాబ్‌ల‌కు కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి ల‌భించ‌లేదు.