English | Telugu
స్థానిక ఎన్నికల్లోనైనా పవర్ స్టార్ పరువు దక్కుతుందా?
Updated : Mar 9, 2020
స్థానిక ఎన్నికల్లో తన సత్తా చాటడానికి పవర్ స్టార్ సిద్దమైయ్యారు. సినిమా స్టైల్‌లో డైలాగులు, స్రిప్ట్ ఆధారంగానే రాజకీయ చర్చలు, సమావేశాల్లో బిజీ అయిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరువు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కుంటున్నారట జననేత.
కనీసం గాజువాక పరిధిలోనైనా ఓటింగ్ శాతం పెంచుకొని పరువు కాపాడుకోవలనే ఆలోచనలో పవన్ ఉన్నారట. స్థానిక ఎన్నికలు అయ్యే వరకు సినిమా షూటింగ్‌ను సైతం పక్కన పెట్టి రాజకీయ సమావేశాల నిర్వహించడంపై దృష్టి పెట్టారు. ఇప్పటికిపుడు అన్నీ పక్కన పెట్టేశారు. ఎన్నికల ప్రక్రియలో తలమునకలౌతున్నారు. ముందుగా వలసలపై దృష్టి పెట్టారు. విశాఖపట్టణం కు చెందిన పలువురు స్థానిక వైసీపీ నాయకులు, యువకులు దల్లి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని జనసేనలో చేర్చుకున్నారు. కండువాలు కల్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాల్సిన సమయమని, ఈ తరుణంలో ఇంత మంది యువకులు పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తునంటు తనదైన శైలిలో ఉపన్యాసాలు దంచుతున్నారు జననేత.
ఆంధ్రప్రజల్ని ఉద్దరిస్తానంటూ మరో సారి ఎన్నికల సమరంలో దిగిన పవర్‌స్టార్‌కు జనం ఎలా స్పందిస్తారో అన్న అంశంపై రాష్ట్రంలో మరోసారి ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. కాపు కమ్యూనిటీలో పట్టు వుందని చెప్పుకుంటున్న జనసేన, ప్రజారాజ్యం పార్టీల పట్ల గతంలో ప్రజల స్పందన చూస్తే వాస్తవం ఏమిటో అర్థం అవుతుంది.
2008లో ప్రజారాజ్యం పార్టీ 294 సీట్లు పోటీచేసి 17 శాతం ఓట్లు పొంది ఆ పార్టీ 18 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో జనసేన అసెంబ్లీ ఎన్నికల్లో 6.7 శాతం ఓట్లు పొందింది. 136 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు గెలుచుకుంది. ఎ.పి.లో 17 స్థానాలకు పోటీ చేసి లోక్‌సభకు 6.1 శాతం ఓట్లు మాత్రమే పొందింది. చాలా నియోజకవర్గాల్లో 5 శాతం కంటే తక్కువ ఓట్లు పొందింది. నోటా కంటే తక్కువ ఓట్లు జనసేనకు పడ్డాయి.
నిజానికి రాష్ట్రానికి సంబంధించినంత వరకు మొన్నటి ఎన్నికల్లో బిజెపికన్నా జనసేనకు వచ్చిన ఓట్లు ఎక్కువే. బిజెపికి కేవలం 0.84 శాతం ఓట్లు వచ్చాయి. అయితే జనసేనకు కొంతమంది కాపు సామాజికవర్గం ఓట్లు, మిగిలినవి అభిమానుల ఓట్లు వచ్చాయి. అంతే కానీ మామూలుగా జనాల వేసిన ఓట్లు తక్కువనే ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.
ఇప్పట్టికీ జనసేనకు ఉన్న సమస్యేమిటంటే ఏ స్ధాయిలోనూ అసలు పార్టీ నిర్మాణమే జరగలేదు. ఏదో గాలివాటంగా నెట్టుకొచ్చేస్తున్నాడు జననేత. అందుకే బీజేపీతో కలిసి జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో తలపడాలనుకుంటోంది.
రెండు పార్టీలు కలిసి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేయాలనే డిసైడ్ అయ్యాయి. అయితే వచ్చిన చిక్కు ఏందంటే, బిజేపీ రాజకీయాలు పవర్‌స్టార్‌కు అర్థం కావడం లేదట. బిజెపిని నమ్ముకొని రాజకీయం చేస్తున్న జననేతకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంతో సఖ్యతగా వుండటం, బీజేపీ అధినాయకత్వం జగన్‌పై సాఫ్ట్‌గా ఉండటంతో పవర్ స్టార్‌కు మింగుడుపడటం లేదట. జగన్ బీజేపీతో స్నేహం చేస్తుంటే, స్థానిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొరాటం చేస్తే జనం ఎలా అర్థం చేసుకుంటారంటూ జనసేనాని గుర్రుగా ఉన్నారట.
బిజెపి తనను వెర్రి వెంకళప్ప చేస్తున్న విషయం ఇంకా పవర్ స్టార్‌కు అర్థం కావడం లేదని జనం అనుకుంటున్నారు. వైసిపికి గట్టి పోటి ఇస్తామని బిజెపి, జనసేన పార్టీల నేతలు ప్రకటించాయి. అసలు ఇంతకీ పవన్ ప్రచారానికి టైం కేటాయిస్తారా? అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా తయారైంది.