English | Telugu

వైసిపిని చిత్తు చేయ‌డానికి ఆ మూడు పార్టీలు మ‌ళ్ళీ క‌లుస్తాయా?

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు రోజు రోజుకీ ఉత్కంఠ‌త‌ను రేపుతూ రసవత్తరంగా మారుతున్నాయి.
వైసీపీ అధికారాన్ని చేపట్టి ఏడాది కూడా కాకముందే అప్పుడే పరిస్థితులు అన్ని తారుమారు అయితున్నాయా? ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్ర చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఇచ్చిన హామీలు నిల‌బెట్టుకోలేక‌పోయార‌నే విమ‌ర్శ‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఓ ప‌రీక్ష‌గా మారాయా?

అయితే ఎన్నికల ముందు చెప్పిన పథకాలు, హామీలు పక్కాగా అమలవుతున్నాయా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు తీవ్ర వివాదస్పదంగా మారిన విషయం మాత్రం రాజధాని అంశం ఒక్కటే అని చెప్పాలి.

వికేంద్రీకరణ పేరుతో ఇప్పుడు జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయితే జగన్ ఈ నిర్ణయం ప్రకటించడంతో ఆనాడు రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు రాజధానిని మార్చవద్దంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే సీఎం జగన్ ప్రజల నుంచి మంచి పేరు కంటే కూడా వ్యతిరేకతనే ఎక్కువగా మూటగట్టుకున్నారు. ఓ పక్క పోలవరం పనులు పూర్తిగా మూలనపడ్డాయి, పెట్టుబడులు రావడం ఏమో కానీ ఉన్న పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అయితే వీటన్నిటిని జగన్ అర్ధం చేసుకునేలోపే ప్రత్యర్ధులు తమ బలం పెంచుకుంటూ ప్రభుత్వంపై వ్యూహాలు రచిస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సమర్ధంగా ఎదురుకుంటున్నారు. జగన్‌పై వస్తున్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. మొన్న ఇసుక సమస్యపై కార్మికులకు మద్ధతుగా నిలిచారు, నేడు రాజధాని రైతులకు మద్ధతుగా పోరాటం చేస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ సారి చంద్రబాబు అధికారం కోల్పోవడం తిరిగి కేంద్రంలో మళ్ళీ బీజేపీనే అధికారంలోకి రావడంతో బాబు సైలెంట్ అయిపోయారు. అయితే ఎన్నికలలో ఓడిపోయాక చంద్రబాబు బాగా నమ్మిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి వారు బీజేపీలో చేరిపోయారు. అయితే వారిని చంద్రబాబు కావాలనే బీజేపీలోకి పంపారని, త్వరలో టీడీపీనీ కూడా బీజేపీలో కలిపేస్తారని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు.

అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీతో జగన్ సన్నిహితంగా మెలిగారు. చంద్రబాబు ఓటమికి పరోక్షంగా బీజేపీ కూడా జగన్‌కి కాస్త సహాయం చేసిందని టాక్. అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది కట్ చేస్తే తాజాగా జనసేన వెళ్ళి బీజేపీతో చేతులు కలిపింది. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ, జనసేన కలిసిందని 2024 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ఆ రెండు పార్టీలు ప‌నిప్రారంభించాయి.

2014 ఎన్నికలలో బీజేపీ, జనసేన సహాయంతో చంద్రబాబు ఎన్నిక‌ల్లో గెలిచారు. జగన్‌ని దెబ్బ కొట్టాలని అనుకుంటే ఈ మూడు పార్టీలు మళ్ళీ కలిసి పోటీ చేయాలట‌. వైసీపీ ని ఎదుర్కోవాలంటే టీడీపీ ఒక్కదానితో అయ్యే పని కాదు, అలా అని బీజేపీ-జనసేనతో అయ్యే పని కూడా కాదని భావిస్తున్న ఈ మూడు పార్టీలు స్థానిక ఎన్నిక‌ల్లో వ్యూహాత్మ‌కంగా వైసిపిని దెబ్బ‌కొట్టాల‌ని చూస్తున్నార‌ట‌.